Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో.. ఏపీ అసెంబ్లీ సీన్‌!

By:  Tupaki Desk   |   17 Nov 2017 2:34 PM GMT
తెలంగాణ‌లో.. ఏపీ అసెంబ్లీ సీన్‌!
X
అదేంటి?! అని ఆశ్చ‌ర్యంగా ఆలోచిస్తున్నారా? నిజ‌మేన‌ట‌! ఏపీ అసెంబ్లీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌మావేశాల‌ను మిన‌హాయిస్తే.. గ‌తంలో ఎప్పుడు స‌మావేశాలు జ‌రిగినా ఒక్క‌టే సీన్ మ‌న‌కు క‌నిపించేంది. అధికార ప‌క్షం స‌భ్యులు - సీఎం ఎప్పుడు మైకందుకున్నా.. క‌ట్ అనే మాటే ఉండేది కాదు. కానీ, విప‌క్షం నుంచి ఎవ‌రు మైక్ అడిగినా ఇచ్చిన‌ట్టే ఇచ్చి క‌ట్ చేసేసిన సంద‌ర్భాలు అనేకం. ఇక‌, ఏకంగా విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గానే ఎన్నో స‌మ‌యాల్లో మైక్ క‌ట్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ``మైక్ `` కోసం పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒక‌ పక్క ప్ర‌జా స‌మ‌స్యల‌పై విప‌క్షం సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతామంటూనే ఇలా మైక్ క‌ట్ చేయ‌డం ఏంట‌ని వైసీపీ స‌భ్యులు పెద్ద ఎత్తున గొంతు చించుకున్నా ప‌ట్టించుకున్న నాధ‌డు లేడు.

ఇదీ ఏపీ అసెంబ్లీ ప‌రిస్తితి. అధికార ప‌క్ష‌మైతే.. ఒక‌లా.. విప‌క్షమైతే మ‌రోలా ప‌రిస్థితి మారిపోయింది. ఈ ప‌రిస్థితిపై అనేక‌మంది మేధావులు - రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక సంద‌ర్భంలో మీడియా ముఖంగా కూడా చెప్పారు. ``అక్క‌డ‌(ఏపీ) విప‌క్షానికి మైకులే దొర‌క‌డం లేదు. ఇక్క‌డ మేం గంట‌ల త‌ర‌బ‌డి వారికే(విప‌క్షం) మైకులు ఇస్తున్నాం`` అన్నారు. ఇది జ‌రిగి ఓ ఆరు నెల‌లు మాత్ర‌మే గ‌డిచింది. ఇంత‌లోనే ప‌రిస్థితి తిర‌గ‌బ‌డింద‌ని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ సీన్ క‌నిపిస్తోంద‌ని వాపోతున్నారు. తాము ఎంత మొత్తుకున్నా స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి `మైక్‌` ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అల‌సు సభను స్పీకర్ మ‌ధ‌సూద‌నాచారి నడుపుతున్నారో.. లేక సీఎం కేసీఆర్ నడుపుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేత - సీనియ‌ర్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. విప‌క్ష స‌భ్యులు ఎన్ని గంటలైనా మాట్లాడమని సీఎం కేసీఆర్ మీడియా ముందు గొప్ప‌లు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. అలాగ‌ని మేం(విప‌క్ష స‌భ్యులు) మాట్లాడుతుంటే నాలుగు నిమిషాలు కూడా వినటం లేదని, మైకు ఇవ్వ‌డం లేద‌ని వాపోయారు. సభలో మా వాదన వినిపించే పరిస్థితి లేదని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే స‌భ‌కు ఎందుకు వెళ్ల‌డం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రి దీనికి కేసీఆర్ గానీ, ఆయ‌న కుమారుడు కేటీఆర్ గానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.