Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో రాంమాధ‌వ్ మ‌గ‌త‌నం మాట క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   6 July 2018 11:01 AM GMT
టీఆర్ ఎస్ లో రాంమాధ‌వ్ మ‌గ‌త‌నం మాట క‌ల‌క‌లం
X
అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజ‌ధానిలో క‌మ‌ల‌నాథులు.. గులాబీనాథులు భుజం భుజం రాసుకుపూసుకుంటూ.. న‌వ్వులు చిందిస్తూ ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. అందుకు భిన్నంగా తెలంగాణ‌లో మాత్రం ఇరు పార్టీ నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం ఇప్పుడు వాతావ‌ర‌ణాన్ని వేడెక్కేలా చేస్తోంది.

వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ నేత రాంమాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. టీఆర్ ఎస్ నేత‌ల‌కు మ‌గ‌త‌నం లేద‌న్న వ్యాఖ్య‌ సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ నేత‌ల ఆరాచ‌కాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ట్లుగా ఆయ‌న చెప్పుకొచ్చారు.

త‌న ఆరోప‌ణ‌ల‌కు ఒక ఉదాహ‌ర‌ణ చెప్పిన ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఇటీవ‌ల ఒక కౌన్సిల‌ర్ కుమార్తెను ఒక టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చి బెదిరించ‌టం త‌న‌ను ఆందోళ‌న‌కు గురి చేసింద‌న్నారు. మీ నాన్న నా మాట విన‌కుంటే బాగోద‌న్న బెదిరింపున‌కు ఆ పాప భ‌యంతో.. అలాగే అంకుల్ అన్న‌ద‌న్న మాట విని తాను చ‌లించిపోయిన‌ట్లుగా చెప్పారు.

ఆ విష‌యం గురించి విన్నంత‌నే త‌న క‌ళ్లల్లో అప్ర‌య‌త్నంగా క‌న్నీళ్లు తిరిగాయ‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బెదిరింపు పాల‌న జ‌రుగుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. టీఆర్ ఎస్ నేత‌ల గురించి ఈ స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌టం ఇదే తొలిసారి. రాంమాధ‌వ్ వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌ రెడ్డి. జ‌న‌చైత‌న్య యాత్ర‌ల పేరుతో బీజేపీ నేత‌లు చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు సంస్కార‌హీనంగా మారాయ‌న్నారు. టీఆర్ ఎస్ నేత‌ల‌కు మ‌గ‌త‌నం లేద‌న్న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌ను విడిచి పెట్టే ముందుకు రాంమాధ‌వ్ టీఆర్ఎస్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. సంఘ్ లో ప‌ని చేశాన‌ని చెప్పుకునే వ్య‌క్తి మాట్లాడిన భాష ఇదేనా? అంటూ ప్ర‌శ్నించారు. క‌మ‌లం పువ్వు తెలంగాణ‌లో ఎప్పుడో వాడిపోయింద‌ని.. రానున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు. రాంమాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వాతావ‌ర‌ణం వేడెక్క‌గా.. జీవ‌న్ రెడ్డి చేసిన డిమాండ్ రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత మాట‌ల యుద్దానికి తెర తీయ‌టం ఖాయ‌మంటున్నారు.