Begin typing your search above and press return to search.

డబుల్ బెడ్ రూం గాలికి..క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ కు

By:  Tupaki Desk   |   18 Oct 2016 11:24 AM GMT
డబుల్ బెడ్ రూం గాలికి..క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ కు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఫైరయ్యారు. పేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కొత్త క్యాంప్ ఆఫీసు కట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ రాచరిక పోకడలు పోతున్నారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కావాలనే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ పేదలకు ఇళ్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇప్పడు ఆయనకు కొత్తగా క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

పేదల ఆరోగ్యం - ఇళ్ల గురించి పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం సబబు కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు.

కాగా కేసీఆర్ ప్రభుత్వం ఎంతో హడావుడిగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం డల్ గా సాగుతోంది. ఎక్కడా పేదలకు అవి అందుబాటులోకి వచ్చిన దాఖలాలు లేవు. కేవలం ప్రచారానికి తప్ప వాస్తవంలో ఇళ్ల నిర్మాణం లేదని విపక్షాలు కొద్దికాలంగా విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం కొత్త కార్యాలయం అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నేతలు మరోసారి డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ పై మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/