Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ యాగానికి వాళ్ల సొమ్ములా?

By:  Tupaki Desk   |   3 Dec 2016 4:08 PM GMT
కేసీఆర్‌ యాగానికి వాళ్ల సొమ్ములా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త ఏడాది అట్ట‌హాసంగా నిర్వ‌హించిన ఆయుత చండీయాగం గుర్తుండే ఉంటుంది. దేశ ప్ర‌థ‌మ పౌరుడైన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సైతం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు. అట్ట‌హాసంగా సాగిన ఈ యాగం వెనుక కేసీఆర్ నిరంతరం ద్వేషించే ఆంధ్రా పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని కాంగ్రెస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ జేఏసీ చైర్మ‌ణ్ కోదండ‌రాంపై విమ‌ర్శ‌లు చేయడంపై స్పందిస్తూ జీవ‌న్ రెడ్డి ఈ విష‌యం వెల్ల‌డించారు.

తెలంగాణ ఉద్య‌మంలో సారథ్యం వ‌హించిన కోదండరాం ను విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్ కు ఉందా అని జీవ‌న్ రెడ్డి నిల‌దీశారు. టీటీడీపీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో క‌లిసి వేదిక పంచుకున్నందుకు కోదండ‌రాం సిగ్గు విష‌యాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌ కు....తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన ద్రోహులను మంత్రి వర్గంలో చేర్చుకున్న కేటీఆర్ కు సిగ్గుందా అని ప్ర‌శ్నించారు. సినీ హీరో అక్కినేని నాగార్జున - ఆంధ్ర్రా వ్యాపార‌వేత్త‌ నిమ్మగడ్డ ప్రసాద్ లతో దోస్తీ చేస్తున్న కేటీఆర్‌ కు అసలు సిగ్గుందా అని జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆయుత చండియాగానికి అయిన ఖర్చంతా నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టడం వాస్తవం కాదా అని నిల‌దీశారు. కోదండరాం లాంటి మనిషి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో అని జీవ‌న్ రెడ్డి సూచించారు. తెలంగాణ పేరు చెపుతూ మ‌రెంతో కాలం రోజులు గ‌డ‌ప లేర‌ని జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక‌నైనా తెలంగాణ సంక్షేమం కోసం త‌గు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/