Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌కు చెక్ చెబుతూ హైకోర్టులో పిటీష‌న్‌

By:  Tupaki Desk   |   27 Oct 2016 7:29 AM GMT
కేసీఆర్ క‌ల‌కు చెక్ చెబుతూ హైకోర్టులో పిటీష‌న్‌
X
క‌ల‌ల ముఖ్య‌మంత్రిగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చిక్కుల్లో ప‌డ్డారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ముఖ్య‌మంత్రి తాజాగా కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా స‌చివాల‌యంలోని వివిధ శాఖ‌ల్ని వ‌చ్చే నెల 10 నాటికి ఖాళీ చేయాల‌న్న ఆదేశాల్ని జారీ చేసిన ఆయ‌న‌.. ఏడాది వ్య‌వ‌ధిలో అదిరిపోయే స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే పావులు క‌దుపుతున్న ముఖ్య‌మంత్రి వైఖ‌రిపై తెలంగాణ విప‌క్ష నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవ‌లం వాస్తు లోపాల పేరిట భారీ భ‌వ‌న స‌ముదాయాన్ని కూల్చేయ‌టం.. వంద‌లాది కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తూ కొత్త స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ ఆలోచ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

విప‌క్షాల అభ్యంత‌రాల్ని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న ప‌ని తాను అన్న‌ట్లుగా ముందుకెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి స్పీడ్‌ కు క‌ళ్లాలు వేసే ప‌నిని షురూ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. కొత్త స‌చివాల‌యం నిర్మాణంతో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అవుతుంద‌న్న కార‌ణాన్ని ఎత్తి చూపిస్తూ.. ఇదేమాత్రం స‌రికాదంటూ హైకోర్టులో పిటీష‌న్‌ ను దాఖ‌లు చేశారు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి. అత్యవ‌స‌ర వ్యాజ్యంగా త‌మ పిటీష‌న్‌ ను స్వీక‌రించాల‌ని హైకోర్టును కోరారు. పిటీష‌న్ విన‌తిపై స్పందించిన హైకోర్టు ద‌ర్మాస‌నం.. ఈ కేసును శుక్ర‌వారం విచారిస్తామ‌ని పేర్కొంది. ఇప్ప‌టికే తాను తీసుకున్న ప‌లు అంశాల‌పై హైకోర్టు నుంచి అక్షింత‌లు వేయించుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. స‌చివాల‌యం కూల్చివేత విష‌యంలో ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కోర్టు కానీ పిటీష‌న్‌ పై ఏమాత్రం సానుకూలంగా స్పందించినా.. కేసీఆర్ క‌ల‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/