Begin typing your search above and press return to search.

జీవ‌న్ రెడ్డి వ‌ర్సెస్ ర‌మ‌ణ‌.. అక్క‌డా త‌ప్ప‌దా..!

By:  Tupaki Desk   |   17 Dec 2021 1:30 AM GMT
జీవ‌న్ రెడ్డి వ‌ర్సెస్ ర‌మ‌ణ‌.. అక్క‌డా త‌ప్ప‌దా..!
X
జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జీవ‌న్‌రెడ్డి, ర‌మ‌ణ మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం ఇప్ప‌టితో ముగిసేలా లేదా..? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే వీరి వైరానికి ఫుల్‌స్టాప్ ప‌డింది అనుకుంటే.. మ‌ళ్లీ మండ‌లిలో క‌త్తులు దూయ‌క త‌ప్ప‌డం లేదా..? ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే ఇవే అనుమానాలు క‌లుగుతున్నాయి.

తెలంగాణ శాస‌న‌మండ‌లి ఫ‌లితాలు ఇటీవ‌ల వెలువ‌డ్డాయి. స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రిగిన ఈ ఎన్నిక‌లో క‌రీంన‌గ‌ర్ నుంచి గెలుపొందిన ర‌మ‌ణ త్వ‌ర‌లో మండ‌లిలో అడుగు పెట్ట‌బోతున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న ర‌మ‌ణ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవ‌ల టీఆర్ఎస్ లో చేరారు. వ‌చ్చీ రాగానే పార్టీ అధినేత కేసీఆర్ ర‌మ‌ణ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. చేనేత మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తారనుకుంటే ఏకంగా పెద్ద‌ల స‌భ‌కే పంపించారు. అయితే ఆయ‌న ఇక్క‌డే మ‌రో స‌మ‌రానికి సిద్ధం కావాల్సిన ప‌రిస్థితి ఉంది. ర‌మ‌ణకు రాజ‌కీయ బ‌ద్ధ శ‌త్రువు అయిన‌ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఇప్ప‌టికే మండ‌లి నేత‌గా ఉన్నారు.

ఇప్పుడు ర‌మ‌ణ కూడా టీఆర్ఎస్ త‌ర‌పున మండ‌లిలో అడుగు పెడుతుండ‌డంతో ఉత్కంఠ‌భ‌రిత‌మైన ప‌రిస్థితులు నెల‌కొన‌బోతున్నాయి. వీరి న‌డుమ‌ వాద సంవాదాలు జోరుగా ఉండ‌బోతున్నాయి. వీరిద్ద‌రూ అనుకోకుండా ఎదురుప‌డుతున్నా పాత జ్ఞాప‌కాల‌ను నెమరువేసుకోక మాన‌రు. ఒక‌రినొక‌రు ముప్పు తిప్ప‌లు పెట్టుకోక త‌ప్ప‌దు. దీనిపై పొలిటిక‌ల్ స‌ర్కిళ్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జ‌గిత్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ కు కంచుకోట ఒక‌ప్పుడు. కాంగ్రెస్ త‌ర‌పున టి జీవ‌న్ రెడ్డి ఆరుసార్లు ఇక్క‌డి నుంచి గెలిచారు. అయితే ఆయ‌న‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి ఎదురైంది తెలుగుదేశం అభ్య‌ర్థి ఎల్ ర‌మ‌ణ నుంచే. దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు వీరి వైరం కొన‌సాగింది. ర‌మ‌ణ‌పై జీవ‌న్ రెడ్డి రెండు సార్లు గెలిస్తే.. జీవ‌న్ రెడ్డిపై ర‌మ‌ణ కూడా రెండు సార్లు పై చేయి సాధించారు. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు వీరిద్ద‌రి మ‌ధ్య ఇదే ఒర‌వ‌డి కొన‌సాగింది.

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటుతో ర‌మ‌ణ వెన‌క్కి వెళ్లిపోయారు. 2014, 18 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ కొన్ని స్థానాలు గెలిచినా ర‌మ‌ణ మాత్రం జ‌గిత్యాల నుంచి రెండు సార్లు ఓడిపోయి త‌న ప్ర‌త్య‌ర్థి ముందు నిల‌వ‌లేక‌పోయారు. ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ రెండు ప‌ర్యాయాలూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి సంజ‌య్ కుమార్ కు గ‌ట్టి పోటీ ఇచ్చింది జీవ‌న్ రెడ్డి మాత్ర‌మే. ఇక్క‌డితో వీరి వైరుధ్యానికి ఫుల్‌స్టాప్ పడింది. మ‌ళ్లీ పుష్క‌ర కాలం త‌ర్వాత ఎమ్మెల్సీల ప‌ద‌వుల ద్వారా మండ‌లిలో క‌ల‌వ‌బోతున్నారు. మండ‌లిలో వీరిద్ద‌రు ఏయే అంశాల‌పై ఎదురుప‌డ‌తారు..? ఎవ‌రిపై ఎవ‌రు పై చేయి సాధిస్తారో వేచిచూడాలి.