Begin typing your search above and press return to search.

జీవిత రాజశేఖర్ చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే..?

By:  Tupaki Desk   |   28 May 2022 8:31 AM GMT
జీవిత రాజశేఖర్ చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే..?
X
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో జీవిత - రాజశేఖర్ దంపతులు సినిమాల కంటే వివాదాలతో ఎక్కవగా వార్తల్లో నిలుస్తున్నారు. 'గరుడవేగ' సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జీవిత పై నగరి కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.

జీవితపై చెక్ బౌన్స్ కేసులో 'గరుడ వేగ' చిత్రాన్ని నిర్మించిన జ్యో స్టార్ సంస్థకు చెందిన కోటేశ్వరరాజు - హేమ లు నగరి కోర్టును ఆశ్రయించారు. తమకు ఇవ్వాల్సిన 26 కోట్ల రూపాయలను జీవిత తిరిగి చెల్లించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత తమ వద్దకు వచ్చి ఎమోషనల్ అయ్యారని.. రాజశేఖర్ వాళ్ల నాన్న వరదరాజన్ కోరిక మేరకు ఆస్తులు తాకట్టుపెట్టుకుని డబ్బులు ఇచ్చామని నిర్మాతలు తెలిపారు. అయితే ప్రాపర్టీ తమ వద్ద పెట్టి ఆ ఆస్తులను బినామీల పేరుతో మార్చుకుని మోసం చేశారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో నిర్మాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నగరి కోర్టు గత నెలలో జీవితపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తాజాగా శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే అనారోగ్యం కారణంగా జీవిత రాజశేఖర్ కోర్టుకు హాజరుకాలేదని తెలుస్తోంది.

జీవిత తరపున ఆమె అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది. అయితే గతంలోనూ జీవిత ఇలాంటి కారణం చెప్పే కోర్టుకు హాజరు కాలేదని జ్యో స్టార్ ఎండీ హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, 2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఈ సినిమాని నిర్మించగా.. జీవితా - రాజశేఖర్ ఫ్యామిలీ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఇటీవల రాజశేఖర్ హీరోగా జీవిత తెరకెక్కించిన 'శేఖర్' సినిమా కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.