Begin typing your search above and press return to search.

అమెజాన్ అధినేత సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 AM GMT
అమెజాన్ అధినేత సంచలన నిర్ణయం
X
ప్రపంచ కుబేరులంతా సేవ బాటపడుతున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన సంపాదనలో సింహభాగం సేవకే ఖర్చు పెట్టగా.. తాజాగా ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సైతం అదే పనిచేశారు. తాను అర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజసేవ కోసమే ఖర్చు చేస్తానని జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన చేశారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన జీవితకాలంలో తన $ 124 బిలియన్ల నికర విలువలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు తన సంపదలో ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తానని ఓ మీడియా ఇంటర్వ్యూలో జెఫ్ బెజోస్ వ్యాఖ్యలు చేశారు. లోతైన సామాజిక, రాజకీయ విభజనల నేపథ్యంలో మానవత్వాన్ని ఏకం చేయగల వ్యక్తులకు ఈ చర్య ద్వారా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం.. జెఫ్ బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో ఏకంగా 10 లక్షల కోట్లపైనే. ఆయన మిత్రురాలు లారెన్ సాంచెజ్ తో కలిసి జెఫ్ బెజోస్ మీడియాతో మాట్లాడారు. తన సంపదలో మెజార్టీ వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారన్న దానిపై మాత్రం వీరు క్లారిటీ ఇవ్వలేదు.

అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని.. అలాగే సమాజసేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు.

జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శించారు. ఇప్పుడు అమెజాన్ అధినేత కూడా తాను సమాజ సేవకు అంకితం అని ప్రకటించడంతో ఈ ఆరోపణలకు కాలం చెల్లింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.