Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లో ఆయిల్ అయిపోతే? పిడుగు పడితే?

By:  Tupaki Desk   |   22 Aug 2015 4:40 AM GMT
ఫ్లైట్ లో ఆయిల్ అయిపోతే? పిడుగు పడితే?
X
కాస్త కుడి ఎడంగా చోటు చేసుకున్న రెండు విమాన ఉదంతాల గురించి వింటే గొంతులో తడారిపోతుంది. విమాన ప్రయాణంలో ఇంత ప్రమాదం పొంచి ఉందా? అన్న టెన్షన్ మొదలుకాక తప్పదు. సాంకేతికంగా తప్పులు జరగటం పక్కన పెడితే.. కాలం.. ఖర్మం సరిగా లేకుంటే ఎంత పెద్ద ప్రమాదమోనన్న విషయాన్ని తెలియజేసే ఉదంతాలివి. ఈ రెండు ఘటనల్లో ఒకదాన్లో పూర్తిగా మానవ తప్పిదమైతే.. రెండో ఉదంతంలో మాత్రం కేవలం కాల మహిమ అనుకోవాల్సిందే.

ఊహకు కూడా అందని ఘటన తాజాగా చోటు చేసుకోవటంతో నోట వెంట మాట రాని పరిస్థితి. బైక్ లోనో.. కారులోనో పెట్రోల్ అయిపోతే ఎదురయ్యే చికాకుకే చిరాకు పడిపోతాం. అలాంటిది గాల్లో ఎగురుతున్న విమానంలో ఆయిల్ అయిపోతే? అలాంటిది జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే పరిణామం ఎలా ఉంటుందన్న విషయం తాజాగా అనుభవంలోకివచ్చేసింది.

దోహా నుంచి కొచ్చికి వెళ్లే జెట్ఎయిర్ వేస్ విమానంలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకోవటంతో సదరు విమానంలో ఉన్న152 భయంతో బిక్కచచ్చిపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కాలం గడిపిన పరిస్థితి. దోహా నుంచి కొచ్చిలో ల్యాండ్ కావాల్సిన విమానం.. షెడ్యూల్ ప్రకారం కొచ్చి వద్దకే వచ్చింది. అయితే.. వాతావరణ సరిగా లేకపోవటంతో రన్ వే ఎక్కడుందో సరిగా అర్థం కాక.. విమానాన్ని బెంగళూరు.. కొచ్చిన్ విమానాశ్రయానికి మధ్య ఆరుసార్లు చక్కర్లు కొట్టింది.

ఇదే సమయంలో విమానంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోయాయన్న విషయాన్ని గుర్తించారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సాధారణంగా విమానంలో ఆయిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయన్న సమయంలోనూ 3500 కిలోల ఇంధనం ఉంటుంది. అయితే.. అంత కూడా లేకపోగా.. చివరి బొట్టు వరకూ అయిపోయిన పరిస్థితి.

దీంతో.. లాభం లేదనుకున్న పైలెట్ తెలివిగా వ్యవహరించి.. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేయటంతో విమానంలోని వారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి విమానంలో ఆయిల్ పూర్తిగా అడుగంటిందని చెబుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా పెను ప్రమాదం చోటు చేసుకొని ఉండేదని చెబుతున్నారు. అయినా.. తగిన ఆయిల్ నిల్వలు లేకుండా అంత దూర ప్రయాణాన్ని ఎలా చేసినట్లు..? ఈ అంశం మీదనే అంతర్గత విచారణ జరిపి.. పైలెట్లను సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆకాశంలో ఉన్నప్పుడే కానీ ఆయిల్ పూర్తిగా అయిపోయి ఉంటే.. పెను ప్రమాదం సంభవించేదని చెబుతున్నారు.

ఈ ఘటన ఇలా ఉంటే.. అమెరికాలోని అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని ఓ విమానంపై పిడుగు పడింది. ఆకాశంలో ఉన్నప్పుడు పక్షి దెబ్బకే విలవిలలాడిపోయే అంత పెద్ద విమానం.. వాయు వేగంతో వచ్చిపడే పిడుగు దెబ్బకు ఏమవుతుంది? వినేందుకే విపరీతమైన భయానికి గురి చేసే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదాల్ని ఊహించి.. ముందుజాగ్రత్త చర్యగా అలాంటి ప్రమాదాల్ని సైతం ధీటుగా ఎదుర్కొనేలా విమానాన్ని రూపొందించటంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

జాక్ పెర్కిన్స్ అనే ప్యాసింజర్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. అయితే.. అతను కూడా.. ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. తాను రికార్డుచేస్తున్న మొబైల్ ఫోన్ లో షూట్ అయిన ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏది ఏమైనా.. 111 మందితో ఉన్న విమానం మీద పిడుగు పడినా.. ఏమీ కాకపోవటం.. అదృష్టంతో పాటు.. సదరు విమాన కంపెనీ ముందు జాగ్రత్తే కాపాడిందని చెప్పక తప్పదు.