Begin typing your search above and press return to search.

షాకింగ్ మాట చెప్పిన పొరుగుదేశం

By:  Tupaki Desk   |   21 March 2017 8:55 AM GMT
షాకింగ్ మాట చెప్పిన పొరుగుదేశం
X
గుండెలు అదిరిపోయే మాట‌ను చెప్పింది పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌. గ‌డిచిన ఏడాదిలో భార‌తదేశంలో ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదుల లెక్క‌ను చెప్పి షాకిచ్చింది. కేంద్ర హోం శాఖ‌కు బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు పెను క‌ల‌క‌లాన్ని సృష్టిస్తోంది. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. ఉగ్ర‌వాదుల‌కు చుక్క‌లు చూపిస్తామ‌ని.. ఉగ్ర‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన బీజేపీ నేత‌ల మాట‌కు భిన్నంగా వాస్త‌వ ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం బంగ్లాదేశ్ నివేదిక‌తో స్ప‌ష్టమ‌య్యే ప‌రిస్థితి.

హ‌ర్క‌త్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామి.. జ‌మాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కి చెందిన దాదాపు 2010 మంది ఉగ్ర‌వాదులు 2016లో స‌రిహ‌ద్దులు దాటి భార‌త్‌ లోకి ప్ర‌వేశించిన‌ట్లుగా వెల్ల‌డించింది. బంగ్లా స‌రిహ‌ద్దు దాటిన వారంతా ప‌శ్చిమ‌బెంగాల్‌.. అసోం.. త్రిపుర రాష్ట్రాల్లో అడుగు పెట్టిన‌ట్లుగా బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే ఉగ్ర‌వాదులు ప‌శ్చిమ‌బెంగాల్‌ లోకి చొర‌బ‌డ్డాయ‌న్న స‌మాచారం ఆ రాష్ట్ర నిఘా అధికారులు కేంద్రానికి స‌మాచారం అందించినా.. ఎంత‌మంది అన్న అంశం బ‌య‌ట‌కు రాలేదు. ఇలాంటి వేళ‌.. బంగ్లాదేశ్ స‌ర్కారు ఇచ్చిన నివేదిక క‌ల‌క‌లం రేపుతోంది. ఇదిలా ఉంటే.. 2014.. 2015ల‌లో కూడా చొర‌బాట్లు జ‌రిగాయ‌ని.. బంగ్లాదేశ్ నుంచి 2014లో దాదాపు 800 మంది 2015లో 659 మంది భార‌త్‌లోకి అడుగుపెట్టిన‌ట్లుగా నిఘా వ‌ర్గాలు గుర్తించిన‌ట్లుగా కేంద్ర అధికారులు చెబుతున్నారు.

అయితే.. తాజాగా బంగ్లాదేశ్ చెబుతున్న‌ట్లుగా చొర‌బాట్ల సంఖ్య 2050కు చేర‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా నివేదిక నేప‌థ్యంలో ప‌శ్చిమ‌బెంగాల్ బెంబేలెత్తుతుండ‌గా.. ఉగ్ర‌వాదులు పెద్దఎత్తున ప్ర‌వేశించార‌న్న స‌మాచారంతో అసోం.. త్రిపుర రాష్ట్రాల వారు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/