Begin typing your search above and press return to search.

కశ్మీర్ ప్రస్తావన తేకుండానే జిన్ పింగ్ ఎందుకు వెళ్లినట్లు?

By:  Tupaki Desk   |   12 Oct 2019 2:09 PM GMT
కశ్మీర్ ప్రస్తావన తేకుండానే జిన్ పింగ్ ఎందుకు వెళ్లినట్లు?
X
కేవలం యాభై గంటల ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది. మీడియాకు వివరాలు వెల్లడించటానికి కొద్ది రోజుల ముందు నుంచే.. జిన్ పింగ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే.. జరుగుతున్న ఏర్పాట్లు ఎందుకన్న విషయాన్ని గోప్యంగా ఉంచేశారు. అంచనాలకు తగ్గట్లే.. కశ్మీర్ మీద చైనా అధ్యక్షుడు ప్రస్తావించకుండానే భారత్ పర్యటనను ముగించుకొని వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

కశ్మీర్ అంశం భారత్ అంతర్గత అంశమని తేల్చి చెబుతున్న వేళ.. ఆ వాదనను గౌరవించే రీతిలో చైనా అధ్యక్షుడి పర్యటన సాగినట్లు చెప్పాలి. అంతేకాదు.. జిన్ పింగ్ పర్యటన వేళ.. కశ్మీర్ అంశం అస్సలు ఇరు దేశాధినేతల మధ్య చర్చకు రాలేదంటూ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేయటం గమనార్హం. తాజా చర్యతో దాయాది మీద పైచేయి సాధించినట్లుగా చెబుతున్నారు.

మోడీ.. జిన్ పింగ్ మధ్య జరిగిన కార్యక్రమాల గురించి గోఖలే వివరిస్తూ.. ఇరు దేశాధినేతలు 90 నిమిషాల పాటు చర్చలు జరుపుకున్నారని.. తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగినట్లు చెప్పారు. మోడీ ఇచ్చిన మధ్యాహ్నం విందును జిన్ పింగ్ చేశారు. తాజా పర్యటనలో ఇరు దేశాధినేతలు దాదాపు ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ కావటం గమనార్హం.

భారత్.. చైనా మధ్య పరస్పర సహకారం.. పర్యాటకం.. వాణిజ్యం తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మోడీని చైనా పర్యటనకు రావాల్సింది జిన్ పింగ్ కోరారని.. ఆయన ఇన్విటేషన్ ను మోడీ అంగీకరించినట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన దాయాది పాక్ కు మింగుడుపడని రీతిలో సాగినట్లుగా చెప్పాలి. ఇరు దేశాలు మర్యాదపూర్వకంగా వ్యవహరించటంతో పాటు.. ఒకరి అంశాల్లోకి మరొకరు పోకుండా ఉండటంతో తమ మధ్య కనిపించని దూరాన్ని తగ్గించే ప్రయత్నం తాజా పర్యటనలో జరిగిందని చెప్పాలి.

జిన్ పింగ్ పర్యటన ముగిసిన తర్వాత చైనీస్ లో థ్యాంక్స్ అంటూ మోడీ ట్వీట్ చేశారు. భారత్ కు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన మోడీ.. చెన్నై వారధిగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత గొప్పగా సాగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిన్ పింగ్ సైతం తన భారత్ పర్యటన సంతృప్తికరంగా సాగిందని చెప్పటంతో పాటు.. మోడీ అతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. దీనికి తగ్గట్లే.. జిన్ పింగ్ మహాబలిపురానికి వచ్చిన సందర్భంలో స్వాగతం పలికేందుకు కారు ఆగే స్థలంలో వెయిట్ చేయటమే కాదు.. తిరిగి వెళ్లే వేళలోనూ కారు వరకూ వచ్చి ఆయన్ను సాగనంపిన తీరు కూడా జిన్ పింగ్ ను ఆకట్టుకునేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.