Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ప్రసార హక్కుల రేసులో జియో ఛానల్ .. స్టార్ , సోనీ లకి చెక్ పెడుతుందా ?

By:  Tupaki Desk   |   23 Nov 2021 12:30 AM GMT
ఐపీఎల్ ప్రసార హక్కుల రేసులో జియో ఛానల్ .. స్టార్ , సోనీ లకి చెక్ పెడుతుందా ?
X
ఐపీఎల్ టోర్నమెంట్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పై కనక వర్షాన్ని కురిపిస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్లల్లో ఒకటిగా ఇదివరకే గుర్తింపు తెచ్చుకున్న ఈ ధనాధన్ ఫార్మట్‌ బీసీసీఐకి ఓ బంగారుబాతులా మారింది. కొత్తగా మరో రెండు ఫ్రాంఛైజీలు వచ్చి చేరిన తరువాత మరింత డిమాండ్ పెరిగింది.

ఈ రెండు ఫ్రాంఛైజీల ద్వారా 13 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని చవి చూసింది. అహ్మదాబాద్ నుంచి సీవీసి కేపిటల్స్, లక్నో నుంచి ఆర్పీ-సంజీవ్ గోయెంకా జట్లు రావడంతో ఐపీఎల్ మ్యాచ్‌ ల సంఖ్య మరింత పెరగనుంది.దానికి అనుగుణంగా ప్రసార హక్కుల ద్వారా రాబట్టుకోవాల్సిన ఆదాయాన్ని మరింత పెంచుకోనుంది బీసీసీఐ.

2023-2027 మధ్య అయిదు సంవత్సరాల కాలానికి సంబంధించిన ప్రసార హక్కులను మంజూరు చేయడం ద్వారా కనీసం అయిదు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2018-2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల కాల పరిమితి వచ్చే ఏడాది ముగిసిపోనుంది. దీనితో మరో అయిదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగులను ఆహ్వానించింది.

స్టార్ నెట్‌వర్క్, సోనీ-జీ నెట్‌వర్క్‌తో పాటు త్వరలో రానున్న జియో ఛానల్ కూడా ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. తన బిడ్డింగులను దాఖలు చేసింది. ప్రస్తుతానికి 16,347.50 కోట్ల రూపాయల మేర విలువ చేసే బిడ్డింగులను అందుకుంది. ఈ విలువ మరింత రెట్టింపు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. క్రమంగా ఇది అయిదు బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంటున్నారు.

2023-2027 కోసం ఐపీఎల్ లో మీడియా హక్కుల టెండర్ రెండు కొత్త ఐపీఎల్ జట్ల నియామకం తర్వాత ప్రారంభిస్తాం అని 25 అక్టోబర్ 2021న బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 28న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత బీసీసీఐ మీడియా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ రెండు కొత్త జట్లను ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ఓ క్లారిటీ రాలేదు.

క్రిక్‌ బజ్ నివేదిక ప్రకారం, టెండర్ జారీలో జాప్యానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మీడియా హక్కుల టెండర్ ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 30,000 కోట్లు తన ఖాతాలో వేసుకోనుందని తెలుస్తోంది. 10వ IPL ఫ్రాంచైజీకి సంబంధించి ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని CVC స్పోర్ట్స్ గెలుచుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే వారి బిడ్ ఇప్పటికీ సందేహంలో ఉందంట. దీని కారణంగా బీసీసీఐ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇంతవరకు జారీ కాకపోవడమేనని సమాచారం. మీడియా ప్రసార హక్కులకు సంబంధించిన ఈ వేలమా లేదా క్లోజ్డ్ బిడ్డింగ్‌కు వెళ్లాలా అనే సందిగ్ధంలో బీసీసీఐ కూరకపోయిందంట. క్లోజ్డ్ బిడ్‌ అయితే బెటర్ అనే వాదనలో ఉన్నట్లు సూచనాప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే ప్రక్రియ ప్రాంచైజీల కోనుగోలులో జరగడంవల్ల బీసీసీఐ చాలా లాభపడింది. టీవీ, డిజిటల్ మీడియా హక్కుల మార్కెట్‌లో ముగ్గురు ప్రధాన పోటీ దారులు కొనసాగుతున్నారు. 2008-2017 వరకు హక్కులను కలిగి ఉన్న సోనీని స్టార్ ఇండియా అధిగమించింది. సోనీ అప్పట్లో 11,050 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లన దాఖలు చేసింది. సోనీ-జీతో పోల్చి చూస్తే- స్టార్ ఇండియా దాదాపు రూ .5,300 కోట్లు ఎక్కువ బిడ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ రెండు కంపెనీలతో పాటు జియో ఛానల్ కూడా పోటీలో నిలవడం ఆసక్తి రేపుతోంది.

త్వరలో జియో ఛానల్ అందుబాటులోకి రానుంది. 2023 నాటి ఐపీఎల్ సీజన్ మొదలయ్యే నాటికి జియో ఛానల్ మనుగడలోకి వస్తుంది. అందుకే జియో ఛానల్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను దాఖలు చేసింది.

దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జియో ఛానల్ పోటీలో ఉండటం వల్ల మిగిలిన రెండు కంపెనీలు గట్టిపోటీని ఎదుర్కొంటోన్నాయి. బీసీసీఐ వార్షిన సర్వసభ్య సమావేశం డిసెంబర్ 4న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో, ముగ్గురు కొత్త సభ్యులను చేర్చడం ద్వారా ఐపీఎల్ నూతన పాలక మండలి ఏర్పాటు కానుంది. ఇది పూర్తయ్యాకే మీడియా ప్రసార హక్కులకు బిడ్లను ఆహ్వనించనున్నట్లు తెలుస్తోంది.