Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః మోడీ వెంటే టీఆర్ ఎస్‌!

By:  Tupaki Desk   |   7 May 2017 6:36 AM GMT
అఫిషియ‌ల్ః మోడీ వెంటే టీఆర్ ఎస్‌!
X
సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల్లో న‌లుగుతున్న బీజేపీ-టీఆర్ ఎస్ దోస్తీపై క్లారిటీ వ‌చ్చింది. జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ - బీజేపీ జ‌ట్టుక‌డ‌తాయ‌ని అనేక విశ్లేష‌ణ‌లు వెలువ‌డిన‌ప్ప‌టికీ రెండు పార్టీల నేతలు ఎప్ప‌టిక‌ప్పుడు తోసి పుచ్చుతూ వ‌స్తున్నారు. అయితే తాజాగా త‌మ మ‌ద్ద‌తు బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏకేన‌ని టీఆర్ ఎస్ అధికారికంగా వెల్ల‌డించింది. రాష్ట్రపతి అభ్యర్థిత్వంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మద్దతు తెలియజేస్తామని టీఆర్‌ ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి వెల్లడించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చారు.

వ‌చ్చే నెలతో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తమ అభీష్టం మేరకు అభ్యర్థిని నియమించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. మరోవైపు ఉమ్మడి అభ్యర్థిని నియమించాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.ఈ క్ర‌మంలో జితేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కేంద్రం తన వంతుగా సహకరిస్తే టీఆర్‌ ఎస్‌ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన వివరించారు. కేంద్రానికి అంశాల వారిగా తమ మద్దతును తెలియజేస్తున్నట్టు జితేంద‌ర్ రెడ్డి వివరించారు. 'రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయం అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి మంచిదైతే మా మద్దతు ఉంటుంది. కేంద్రంగా ఈ దిశ‌గానే న‌డుచుకుంటుంద‌ని భావిస్తున్నాం` అని వివరించారు.

కాగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో విప‌క్షాలు త‌మ అస్త్రాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిలిపే విష‌యంలో బీఎస్పీ అధినేత్రి మయావతి - టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ - డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్‌ ను కలవాలని సోనియాగాంధీ భావిస్తున్నారు. ఇప్పటికే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఎస్పీ నేత - యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తో ఫోన్లో మాట్లాడారు. మ‌రోవైపు కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ స‌మాజ్‌ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయంసింగ్‌ తో - ఆర్జేడీ వ్య‌వ‌స్థాప‌కుడు లాలూయాదవ్‌ తో ఈ విషయంపై చర్చించారు. ఇదే అంశంపై ఇటు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో, సీపీఐ ఎంపీ డీ రాజాతోనూ సోనియాగాంధీ మాట్లాడిన విషయం తెలిసిందే. గతవారం ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌ తోనూ ఉమ్మడి అభ్యర్థి అంశంపై చర్చలు జరిపారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు అటు అధికార‌ - ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీలు రాష్ట్రప‌తి అభ్య‌ర్థి పేరును వెల్ల‌డించ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/