Begin typing your search above and press return to search.

భువ‌న‌గిరిలో జిట్టా వెళ్లేది ఆ పార్టీలోకేనా..?

By:  Tupaki Desk   |   16 Dec 2021 1:01 AM GMT
భువ‌న‌గిరిలో జిట్టా వెళ్లేది ఆ పార్టీలోకేనా..?
X
యువ తెలంగాణ పార్టీ అధ్య‌క్షుడు జిట్టా బాల‌కృష్ణారెడ్డి పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారా..? అధికార పార్టీతో కొట్లాడేందుకు త‌న వేదిక స‌రిపోవ‌డం లేద‌ని భావిస్తున్నారా..? త‌న పార్టీని మ‌రో జాతీయ పార్టీలో విలీనం చేయ‌నున్నారా..? అంటే అవున‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈసారి ఎలాగైనా గెలిచి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జిట్టా బాల‌కృష్ణారెడ్డి తెలంగాణ ఉద్య‌మ కారుడు. ఒక‌ప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సన్నిహితంగా ఉండేవారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం కోసం క‌లిసి కొట్లాడారు.

కానీ త‌ర్వాత కేసీఆర్ తో విభేదాలు రావ‌డంతో టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. యువ తెలంగాణ పార్టీని స్థాపించి బ‌రిలో నిలిచారు. భువ‌న‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రెండు సార్లు రెండో స్థానంలో.. ఒక‌సారి మూడోస్థానంలో నిలిచారు.

భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ కంచుకోట ఒక‌ప్పుడు. కానీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించ‌డంతో ప‌రిస్థితి మారిపోయింది. అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు భువ‌న‌గిరి కోట‌పై తెలుగుదేశం జెండా రెప‌రెప‌లాడింది.

ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచి ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం కూడా ఆయ‌న స‌తీమ‌ణి ఉమా మాధ‌వ‌రెడ్డి వ‌రుస‌గా మూడుసార్లు గెలిచి నియోజ‌క‌వ‌ర్గంపై త‌మ ప‌ట్టును నిలుపుకున్నారు.

2014లో ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డ‌డం.. మొద‌టిసారే టీఆర్ఎస్ జెండా ఎగ‌ర‌వేయ‌డం.. వెనువెంట‌నే జ‌రిగిపోయాయి. 2014, 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పైళ్ల శేఖ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు.

2009 నుంచి 2018 వ‌ర‌కు వ‌రుస‌గా రెండు మూడో స్థానాల్లో నిలిచారు జిట్టా బాల‌కృష్ణారెడ్డి. మాధ‌వ‌రెడ్డి కుటుంబాన్ని, పైళ్ల శేఖ‌ర్‌రెడ్డిని ఎదుర్కోలేక మూడుసార్లు చ‌తికిల‌ప‌డ్డారు. యువ తెలంగాణ పార్టీ త‌ర‌పున కొట్లాడేందుకు త‌న వేదిక స‌రిపోక‌పోవ‌డంతో మ‌రో పార్టీలో విలీనం లేదా పొత్తుకు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

అయితే ఇక్క‌డే మ‌రొక చిక్కు వ‌చ్చి ప‌డింద‌ట‌. జిట్టా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు స‌న్నాహాలు చేసుకుంటుంటే.. యువ తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ జ‌ర్న‌లిస్టు రాణి రుద్ర‌మ‌ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌.

కాంగ్రెస్ నుంచి భువ‌న‌గిరి ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానం తెచ్చుకునేందుకు జిట్టా ప్ర‌య‌త్నం చేస్తుంటే.. రాణి రుద్ర‌మ మాత్రం అవే హామీలు బీజేపీ నుంచి పొందితే బాగుంటుంద‌ని సూచించార‌ట‌. దీంతో జిట్టా ఊగిస‌లాట‌లో ప‌డిపోయార‌ట‌. వీరిద్ద‌రు ఎటువైపు ప‌య‌నిస్తారు.. ఏ పార్టీలో విలీనం చేస్తారు.. అనేది వేచి చూడాలి.