Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ నేత నోట బాబు మాట

By:  Tupaki Desk   |   6 Sep 2015 4:57 AM GMT
టీ కాంగ్రెస్ నేత నోట బాబు మాట
X
ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారనున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఏపీలో చంద్రబాబునాయుడు సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. తెలంగాణ సర్కారును నిలదీయటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా మొదలైన రైతుల ఆత్మహత్యల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సర్కారు.. గత పాలకుల తప్పిదం అంటూ వ్యాఖ్యానించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వారు.. పవర్ లోకి వచ్చి పదిహేను నెలలు దాటిన తర్వాత కూడా.. ఇంకా గత పాలకుల తప్పులంటూ మాట్లాడటంలో అర్థం లేదని చెబుతున్న వారు.. తెలంగాణ వైఖరిని విమర్శిస్తున్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఏపీలో చంద్రబాబు సర్కారు రూ.5లక్షలు పరిహారంగా ఇస్తున్నారని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడుతన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు.. బాధిత కుటుంబాల్ని కనీసం పలుకరించటం లేదని.. అన్నం పెట్టే అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా కనీసం పట్టించుకోవటం లేదని చెలరేగిపోయారు. పంచె కట్టుకోగానే వ్యవసాయ మంత్రి కాలేరంటూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ పై దుమ్మెత్తి పోశారు. మొత్తానికి తన విధానాలతోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన రాజకీయ ప్రత్యర్థి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతున్నారు.