Begin typing your search above and press return to search.

వెనుకబడ్డ ట్రంప్.. ప్రత్యర్థి బిడెన్ ముందంజ

By:  Tupaki Desk   |   21 Jun 2020 1:30 AM GMT
వెనుకబడ్డ ట్రంప్.. ప్రత్యర్థి బిడెన్ ముందంజ
X
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయమా? ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తాజాగా ఓ పోల్ లో పైచేయి సాధించడంతో ట్రంప్ ఓడిపోతారనే ప్రచారం మొదలైంది కరోనా, నిరుద్యోగం, జాత్యంహకారం విషయంలో ట్రంప్ ఫెయిల్యూర్ ప్రత్యర్థి జోబిడెన్ కు వరంగా మారిందని తాజాగా ఫ్యాక్స్ న్యూస్ సంచలన ప్రజాభిప్రాయ సేకరణ కుండబద్దలు కొట్టింది.

చైనా నుంచి ఊడిపడ్డ కరోనా వైరస్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ట్రంప్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించడం ఖాయమని తేలింది. తద్వారా అమెరికాలో వందలమందికి ఉపాధి కోల్పోయి నిరుద్యోగం ప్రబలడం ట్రంప్ ఓటమికి దారితీసేలా ఉందని ఆ సర్వే తేల్చింది.

అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. కరోనా కట్టడిలో ట్రంప్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో కరోనా కేసులు పెరిగాయని.. లాక్ డౌన్ విధించకుండా ఆయన తప్పు చేశారని అంటున్నారు. కేవలం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రజల ప్రాణాలను ట్రంప్ బలిపెట్టాడనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ట్రంప్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతోందని తేలింది. ఇదే సమయంలో ఈయనకు ప్రధాన పోటీదారు అయిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కు మద్దతు పెరుగుతోంది. తాజాగా అక్కడ నిర్వహించిన ఫ్యాక్స్ న్యూస్ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. జూన్ 13 నుంచి 16వరకు అమెరికా వ్యాప్తంగా ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ట్రంప్ కంటే బిడెన్ ఏకంగా 12 పాయింట్లు ఆధిక్యంలో ఉండడం విశేషంగా మారింది. ట్రంప్ కు కేవలం 38శాతం మంది మాత్రమే మద్దతు తెలుపగా.. జోబిడెన్ కు ఏకంగా 50శాతంమంది మద్దతు తెలిపారు. గతంలో 8 పాయింట్లు మాత్రమే లీడ్ లో ఉన్న జోబిడెన్ ఇప్పుడు కరోనా దెబ్బకు, జాత్యంహకారం జ్వాలలకు ఏకంగా 12 పాయింట్లకు ఎగబాకారు.

కరోనా, జాత్యంహకారమే ట్రంప్ కొంప ముంచిందని.. వాటి వల్లే ట్రంప్ కు వ్యతిరేకంగా ఎక్కువమంది ఓటేశారని ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో ట్రంప్ ఓటమి ఖాయమన్న ప్రచారం నెలకొంది. మరి నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందా? అప్పటివరకు ట్రంప్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అన్నది వేచిచూడాలి.