Begin typing your search above and press return to search.

అధ్యక్షుడయ్యాక.. ట్రంప్ లా అయిపోతున్నారే..!!

By:  Tupaki Desk   |   9 Nov 2020 2:30 AM GMT
అధ్యక్షుడయ్యాక.. ట్రంప్ లా అయిపోతున్నారే..!!
X
విద్వేషానికి విరుగుడు మాటలు అమెరికాలో మొదలయ్యాయి. ద్వేషం.. విభజనతో నడిచిన రాజకీయాలకు పుల్ స్టాప్ పడి.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న మాటల్లోని ఐక్యతను తిరిగి తెచ్చే ప్రయత్నాన్ని తన తొలి ప్రసంగంతోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జో బైడెన్. ఎన్నికల్లో విజయం తర్వాత తన సొంత పట్టణమైన విల్మింగ్ టన్ లో అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన కొత్త ఉత్సాహాన్నిచ్చే ప్రసంగాన్ని చేశారు.

ఇప్పటివరకు నోరు తెరిస్తే చాలు.. ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేసే ట్రంప్ మొరటు ప్రసంగాల్ని వింటున్న అమెరికా.. ఇప్పుడు బైడెన్ పుణ్యమా అని కొత్త తరహా మాటల్ని వినటం మొదలెట్టింది. విభజించి చూసే అధినేతను తాను కానని.. అందరిని కలుపుకుపోయే అధినేత అన్న విషయాన్ని తన ప్రసంగంలో చెప్పే ప్రయత్నం చేశారు.

భారీ జనసందోహం మధ్య మాట్లాడిన ఆయన ఉత్సాహంతో మాట్లాడారు. మార్పు మొదలైందన్న సంకేతాల్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ప్రత్యర్థి ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే పంచ్ లు వేసి.. ఆ వెంటనే గాయాలకు మందురాసే వైద్యుడిగానూ మాట్లాడారు. బైడెన్ తొలి ప్రసంగం ఆకట్టుకునేలా ఉంది. ఇదంతా బాగున్నా.. ఒక విషయంలో మాత్రం ఆయన డొనాల్డ్ ట్రంప్ ను పదే పదే గుర్తు చేసేలా వ్యవహరించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. రోజుకు దగ్గర దగ్గర 1.25లక్షల మంది పాజిటివ్ కావటమే కాదు.. వెయ్యి వరకు ప్రజలు మహమ్మారి కారణంగా మరణిస్తున్నారు. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన వేళ.. బైడెన్ చుట్టూ ఉన్న వారంతా ముఖానికి మాస్కుల్ని వినియోగిస్తే.. కాబోయే అధినేత మాత్రం ముఖానికి మాస్కు ధరించకపోవటం గమనార్హం.

కరోనా వేళ.. ముఖానికి మాస్కు పెట్టుకోకుండా ట్రంప్ మొండిగా వ్యవహరించే వారు. మాస్కు ధరించటానికి మక్కువ చూపే వారు కాదు. ట్రంప్ ను గుర్తుకు తెచ్చేలా బైడెన్ తీరును తప్పు పడుతున్నారు. తాజాగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమయంలోనూ బైడెన్ తప్ప మిగిలిన వారంతా కూడా ముఖానికి మాస్కు ధరించి ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు

గత అధ్యక్షుడికి భిన్నంగా మాటలే కాదు.. చేతలు కూడా ఉండాలన్న విషయాన్ని బైడెన్ మర్చిపోకూడదని కోరుకుంటున్నారు.