Begin typing your search above and press return to search.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. గన్స్ పై నియంత్రణ దిశగా జోబైడెన్

By:  Tupaki Desk   |   3 Jun 2022 5:49 AM GMT
అమెరికాలో మళ్లీ కాల్పులు.. గన్స్ పై నియంత్రణ దిశగా జోబైడెన్
X
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈనెలలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు కాల్పులు జరిగి అమాయక ప్రజలు పదుల సంఖ్యలో చనిపోయారు. తాజాగా ఏమ్స్ లోని కార్నర్ స్టోన్ చర్చి బయట గురువారం రాత్రి తుపాకుల మోత మోగింది. ఈ చర్చి బయట ఆగంతుకుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మహిళలపై కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఘటనాస్థలిలో వీరి ముగ్గురు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. నిందితుడు ఆ ఇద్దరు మహిళలను మాత్రమే ఎందుకు చంపాడన్నది తేలాల్సి ఉందని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అంతకుముందు ఓక్లహామాలోని తుల్సా నగరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ దవాఖానా ప్రాంగణంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఆర్థోపెడిక్ సర్జన్ కోసం దుండగుడు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యుడు కనిపించకపోవడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

కొద్ది రోజుల కిందటే అమెరికాలోని ఓ స్కూల్లో దుండగుడు కాల్పులు జరిపి చిన్నారుల ప్రాణాలు తీశాడు. టెక్సాస్‌లోని ఉవాల్డే పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ కాల్పులు జరపడంతో శుక్రవారం 19 మంది పిల్లలు మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు.

మే 16న కూడా న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన ఘటన మరువక ముందే మరోసారి తుపాకీ మోతలతో అమెరికా దద్దరిల్లింది.ఇలా గన్ కల్చర్ తో అమెరికాలో మరణ మృదంగం వినిపిస్తోంది.

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్తపాతాన్ని నివారించడానికి కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ‘ఏకే47, ఏకే15 సహా తొమ్మిది రకాల వెపన్స్ ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు.

అమెరికాలో ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు. అయితే వయసు నిబంధనను సవరించనున్నట్లు జోబైడెన్ తెలిపారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు. దీనిపై చట్టాన్ని తసీుకొని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్ ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్ లో 30 రౌండ్ల వరకూ కాల్పులు జరిపేలా బుల్లెట్స్ ను నింపవచ్చని.. వాటిని కూడా నియంత్రించాలని సూచించారు.