Begin typing your search above and press return to search.

సిలికాన్ వ్యాలీ రూపకర్తలు మీరే .. భారతీయ అమెరికన్ల పై జో బైడెన్ ప్రశంసలు!

By:  Tupaki Desk   |   23 Sep 2020 12:30 PM GMT
సిలికాన్ వ్యాలీ రూపకర్తలు మీరే .. భారతీయ అమెరికన్ల పై జో బైడెన్ ప్రశంసలు!
X
అమెరికా లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మరోసారి అధ్యక్ష పీఠం అందుకోవాలని ట్రంప్ , ఎలాగైనా వైట్ హౌస్ లో కాలు మోపాలని జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా సమయంలో కూడా సభలు , ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి ఓట్లు కూడా చాలా కీలకం. దీనితో ఇద్దరు భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన అమెరికావాసులపై డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తమ దేశ ఆర్థికాభివృద్ధికి భారత సంతతికి చెందిన అమెరికావాసులు ఎంతగానో తోడ్పడ్డారని చెప్పారు. వారి కృషి, వ్యాపార నైపుణ్యాలతో తమ దేశ ఆర్థిక రంగానికి శక్తినిచ్చారని తెలిపారు.

అమెరికాలో వారు సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారని ఆయన చెప్పారు. అమెరికా ఇచ్చే హెచ్‌-1బీ సహా ఇతర వలస విధానాల్లో నెలకొన్న చట్టపరమైన సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. భారతీయులు తమ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్ని నెలకొల్పారని ఆయన కొనియాడారు. సిలికాన్‌ వ్యాలీకి పునాదులు వేశారని, ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉన్న కంపెనీలకు వారు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. హెచ్-1బీ వీసా, జాత్యహంకారం వంటి అంశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆయన విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భావితరాలకు మంచి భవిష్యత్తును అందిస్తానని చెప్పారు. మళ్లీ ఆర్థిక వ్యవస్థను లైన్లో పెడతానని ఆయన తెలిపారు.

అసలు సిలికాన్ వ్యాలీ అంటే ఏమిటంటే ... సిలికాన్ వ్యాలి అనేది దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కొలో ఒక ప్రాంతం. ఈ ప్రాంతం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఈ సిలికాన్ వ్యాలీ లో గూగల్, యాపిల్ వంటి ప్రపంచ స్థాయి ఐ.టి. కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కంప్యూటర్లలో వుండే సిలికాన్ చిప్పులు ఇక్కడ మొదట్లో తయారుచేసేవారు.దీనితో ఈ ప్రాంతానికి "సిలికాన్" అనే పేరు వచ్చింది. సాంకేతిక విజ్ఞానంలో ప్రయోగాలు మొదట్లో ఇక్కడే చేసేవారు. స్టాంఫోర్డు కళాశాలతో కలిసి, అమెరికా సైన్యానికి కావాల్సిన టెక్నాలజి వస్తువులు (రేడియోలు, కంప్యూటర్లు) 1970 ముందర ఇక్కడ ఉద్యోగస్తులు తయారుచేసారు. అలాగే ఈ సిలికాన్ వ్యాలీ లో ఎన్నో ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి.