Begin typing your search above and press return to search.

‘నేనే వ్యాక్సిన్​ తీసుకున్నా.. మీకెందుకు భయం’ జో బైడెన్​

By:  Tupaki Desk   |   22 Dec 2020 4:30 AM GMT
‘నేనే వ్యాక్సిన్​ తీసుకున్నా.. మీకెందుకు భయం’ జో బైడెన్​
X
అమెరికాలో ఫైజర్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​ ఇప్పటికే అమెరికా ఆహార - ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌ డీఏ) అనుమతులు ఇచ్చేసింది. బ్రిటన్​ లోనూ ఇప్పటికే ఫైజర్​ వ్యాక్సినేషన్​ మొదలైంది. మరోవైపు పలు దేశాలు సైతం ఈ వ్యాక్సిన్​ కోసం ఆర్డర్లు వచ్చాయి. అయితే ఈ వ్యాక్సిన్​ పై ప్రజల్లో కొంత అపోహ నెలకొన్నది. సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయోమనని చాలా మంది భయపడుతున్నారు.

ఇప్పటికే ఒకరిద్దరిలో స్వలంగా దుష్ప్రభావాలు కనిపించాయి. ఓ వ్యక్తికి ముఖ పక్షవాతం వచ్చింది. అయితే వేలమందిలో ఒకరికి చిన్న ఎఫెక్ట్ కలగడం మామూలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి శరీరధర్మాన్ని బట్టి కూడా ఇలా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ (78) వ్యాక్సిన్​ తీసుకున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఆయన వ్యాక్సిన్​ తీసుకున్నట్టు సమాచారం. ఆదివారం డెలవర్‌ లోని క్రిస్టియానా ఆస్పత్రిలో జో బైడెన్‌ (78) ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు. ఈ టీకా నిర్ణీత వ్యవధుల్లో రెండుడోసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

బైడెన్​ టీకా తీసుకున్న దృశ్యాలను స్థానిక టీవీల్లో - సోషల్ ​మీడియాలో లైవ్​ టెలీకాస్ట్​ చేశారు. ఈ సందర్భంగా బైడెన్​ మాట్లాడుతూ.. ‘ ఫైజర్​ వ్యాక్సిన్​ ఎంతో సురక్షితమైనది. ఈ వ్యాక్సిన్​ పై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. నేను మొదటి టీకా డోస్ వేయించుకున్నా.. రెండో టీకా కోసం వేచిచూస్తున్నా. వ్యాక్సిన్​ పై ప్రజల్లో అపోహలు తొలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను బహిరంగంగానే వ్యాక్సిన్​ తీసుకున్నా.’ అని బైడెన్​ పేర్కొన్నారు.

బైడెన్‌ తోపాటు ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ టీకా వేయించుకున్నారు. అమెరికాలో వ్యాక్సినేషన్​ ఇప్పటికే మొదలైంది. ముందుగా ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ అయిన ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్​ ఇస్తున్నారు. అయితే అమెరికాలో కరోనా ఉగ్రరూపం చూపించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారితో అమెరికాలో 3.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బ్రిటన్​ లో కొత్తతరహా కరోనా వస్తున్న విషయం తెలిసిందే. క్రిస్​ మస్​ నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు.