Begin typing your search above and press return to search.

ర‌ష్యా హ్యాకింగ్ నిజ‌మే..ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌

By:  Tupaki Desk   |   6 Jan 2017 5:30 PM GMT
ర‌ష్యా హ్యాకింగ్ నిజ‌మే..ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌
X
అగ్ర‌రాజ్యం అమెరికా ఎన్నిక‌ల్లో ర‌ష్యా హ్యాకింగ్‌ కు పాల్ప‌డింద‌ని తేలింది. ఆ దేశ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు - రెండు కీల‌క పార్టీల‌కు చెందిన‌ సేనేట‌ర్లు కూడా స్ప‌ష్టం చేశారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా పాత్ర లేద‌న్న డోనాల్డ్ ట్రంప్ వాదన‌ను కొట్టిపారేశారు. ఇంటెలిజెన్స్ సంస్థ‌ల‌పై ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వ్య‌క్తం చేసిన అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు ప్ర‌య‌త్నించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ఇంటెలిజెన్స్ సంస్థ‌ల సామ‌ర్ధ్యాన్ని - నిష్పాక్షిక‌త‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌ని అధికారులు భావించారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో హ్యాకింగ్ అంశంపై వాషింగ్ట‌న్‌ లోని క్యాపిట‌ల్‌ హిల్ బిల్డింగ్‌ లో సెనేట్ కమిటీ విచార‌ణ‌ జ‌రిగింది. వివిధ రాష్ట్రాల‌కు చెందిన సెనేట‌ర్లు వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఇంటెలిజెన్స్ అధికారులు ర‌ష్యా హ్యాకింగ్ అంశంపై వివ‌ర‌ణ ఇచ్చారు. అమెరికా ఎన్నిక‌ల్లో ర‌ష్యా హ్యాకింగ్‌కు పాల్ప‌డింద‌న్న అంశాన్ని గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్నామ‌ని నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట‌ర్ జేమ్స్ క్లాప‌ర్ సెనేట్ స‌భ్యుల‌కు తెలిపారు. సెనేట‌ర్ల‌కు వివ‌ర‌ణ ఇచ్చిన ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ కూడా ట్రంప్‌కు అదే విష‌యాన్ని వెల్ల‌డించ‌నున్నారు. వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అధ్య‌క్ష‌త‌న సెనేట‌ర్ల‌తో ఇంటెలిజెన్స్ అధికారులు విచార‌ణ‌లో పాల్గొన్నారు.

ఇదిలాఉండ‌గా ఈ సంద‌ర్భంగా త‌మ‌దేశం కాబోయే అధ్యక్షుడి తీరును ప్ర‌స్తుత ఉపాధ్యక్షుడు జో బైడెన్ తూర్పురాప‌ట్టారు. అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. "రిప‌బ్లిక‌న్ నేతగా ఎదిగి... పెద్ద మ‌నిషిలా వ్య‌వ‌హ‌రించాడం అల‌వాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రెసిడెంటువు. నీ పనితీరు ద్వారా నువ్వేంటో చూపించాలి"అని ట్రంప్‌ ను ఉద్దేశించి బైడెన్ విమ‌ర్శ‌లు చేశారు. ఇంటెలిజెన్స్ సంఘాల‌పై ట్రంప్‌ కు విశ్వాసం లేక‌పోవ‌డం మ‌తిలేని విష‌య‌మ‌ని బైడెన్ ఆరోపించారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన కంప్యూట‌ర్ల‌ను ర‌ష్యా హ్యాక్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంటెలిజెన్స్ పెద్ద‌లు ఇచ్చిన నివేదిక‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించాన‌ని బైడెన్ తెలిపారు. అమెరికా ఎన్నిక‌ల ప్రక్రియ‌ను నిర్వీర్యం చేసేందుకు ర‌ష్యా హ్యాకింగ్‌ కు పాల్ప‌డింద‌ని బైడెన్ ఆరోపించారు. హిల్ల‌రీ క్లింట‌న్‌ ను ఓడించేందుకు ఆ హ్యాకింగ్ జ‌రిగింద‌న్నారు. ఊహించిన దాని కంటె ఎక్కువే హ్యాకింగ్ జ‌రిగింద‌ని, హ్యాక్ అయిన అంశాల‌న్నీ వికీలీక్స్ వెబ్‌ సైట్‌ లో వ‌చ్చాయన్నారు. కాగా ట్రంప్ ప్ర‌మాణం ఈనెల 20న జ‌ర‌గ‌నుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/