Begin typing your search above and press return to search.

బాబులాగా జ‌గ‌న్‌ కు కాళ్లు ప‌ట్టుకునే అవ‌స‌రం లేదు!

By:  Tupaki Desk   |   13 May 2017 10:33 AM GMT
బాబులాగా జ‌గ‌న్‌ కు కాళ్లు ప‌ట్టుకునే అవ‌స‌రం లేదు!
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స‌మావేశం అవ‌డంపై టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించ‌డంపై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఘాటుగా స్పందించారు. ప్రధానితో భేటీ అనంతరం చర్చించిన విషయాలన్నీ వైఎస్‌ జగన్‌ మీడియా ముందు పెట్టారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు ప్రతిపక్షనేతపై ఎన్నో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరికాళ్లు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని, అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీనే ఎదురించి బయటకు వచ్చిన వీరుడు వైస్‌ జగన్‌ అని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై, లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యలపై, విభజన చట్టంలోని అంశాలపై వైఎస్‌ జగన్‌ ప్రధానిని కలిస్తే టీడీపీ నేతలకు చలిజ్వరం వచ్చిందని జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. దేవినేనికి కడుపంతా ఉబ్బరం.. అచ్చెన్నాయుడుకు చలిజ్వరాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.

చీకట్లో కాళ్లు పట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని జోగి రమేష్‌ ఆరోపించారు. అమెరికా నుంచి రాగానే ఓటుకు కోట్లు కేసును తిరగదోడి ఎక్కడ జైలుకు పంపిస్తారోనన్న భయంతోనే చంద్రబాబు రహస్యంగా ఢిల్లీలో పర్యటించారని, ఆయన ఎవరికాళ్లు పట్టుకున్నారో మీడియా సమక్షంలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించి, ఢిల్లీలో దొడ్డిదారిన దొంగతనంగా పర్యటించారు. చంద్రబాబు చీకట్లో ఎవరికాళ్లు పట్టుకున్నారో చెప్పాలని జోగి రమేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న సీఎం టీడీపీ మంత్రులకు కూడా తెలియకుండా సుమారు 6 గంటలపాటు ఎవరిని కలిశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనధికార కార్యక్రమమా..? ఎక్కడున్నావ్‌..? ఎవరిని కలిశావ్‌..? అమెరికా పర్యటనకు వెళ్లి అలసిపోయి ఎక్కడైనా రెస్టు తీసుకున్నారా..? అనేది బహిర్గతం చేయాలన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ప్రత్యేక విమానంలో 16 దేశాల్లో పర్యటించారని జోగి ర‌మేష్ గుర్తు చేశారు. అమెరికా పర్యటనకు ముందు 15 సార్లు విదేశాలకు వెళ్లి ఒక్క నయాపైసా కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా స్పెషల్‌ ఫ్లైట్‌లలో తిరుగుతూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఫైరయ్యారు. 16 సార్లు విదేశాలు పర్యటించి ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ``ఎంతమంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ ప్రాజెక్టులు ఏ స్టేజీలో ఉన్నాయి? మూడు సంవత్సరాల్లో ఒక్కటైనా కంప్లీట్‌ చేశారా? చేస్తే ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి?`` అని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు పర్యటనకు అయిన ఖర్చు ఎంతో బయటపెట్టాలన్నారు. విశాఖపట్నంలో రెండు పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు పెట్టారని, ఒకసారి రూ. 5 లక్షల 60 వేల కోట్లు, రెండోసారి రూ. 12 కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని గొప్పగా చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఒక్క కంపెనీ అయినా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందా.. ఒక్క కంపెనీ అయినా ఫౌండేషన్‌ స్టోన్‌ వేసిందా.. అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోగి ర‌మేష్ స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/