Begin typing your search above and press return to search.

కేసీఆర్‌..శ్యామ‌ల శాప‌నార్థాలు విన్నారా?

By:  Tupaki Desk   |   30 July 2018 6:59 AM GMT
కేసీఆర్‌..శ్యామ‌ల శాప‌నార్థాలు విన్నారా?
X
అంతా చేసి తిట్లు తినాల్సి వ‌స్తోంద‌న్న వేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు గులాబీ నేత‌లు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎప్పుడూ జ‌ర‌గ‌నంత ఘ‌నంగా బోనాలు.. బ‌తుక‌మ్మ‌ల‌తో పాటు.. ప‌లు పండుగ‌లు జ‌రుగుతున్న వేళ‌.. కొంత‌మంది చేస్తున్న త‌ప్పుల‌కు అంతిమంగా తిట్లు కాయాల్సిన ప‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద ప‌డుతోంది. తాజాగా మ‌హంకాళి బోనాల సంద‌ర్భంగా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

బోనాల్ని అంగ‌రంగ వైభ‌వంగా చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి జోగిని శ్యామ‌ల పెట్టిన శాప‌నార్థాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి.. శ్యామ‌ల ఆవేద‌న‌కు.. ఆవేశానికి కేసీఆర్ కార‌ణ‌మా? అంటే.. కాద‌ని చెప్పాలి. మ‌రి.. ఎందుకు ఆయ‌న అన్ని తిట్లు తినాల్సి వ‌స్తోందంటే అందుకు కార‌ణం అధికారుల వైఫ‌ల్య‌మేన‌ని చెప్పాలి.

మంత్రులు మొద‌లు.. అధికారుల వ‌ర‌కూ బోనాల్ని భారీగా నిర్వ‌హిస్తున్నామ‌ని.. వైభ‌వంగా చేస్తున్న వైనాన్ని ప్ర‌చార సాధనాలతో మోతెక్కిస్తున్న నేప‌థ్యంలో భ‌క్తులు భారీగా పోటెత్తుతున్నారు. కాస్త త‌క్కువ ఉత్సాహంతో ఉన్న వారు సైతం ఈ ప్ర‌చార ఆర్భాటాల్ని చూసి.. ఎంత బాగా చేస్తున్నారో అన్న ఉద్దేశంతో వ‌స్తున్న వైనం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

దీంతో ఎదుర‌వుతున్న ఇబ్బందేమంటే.. అంచ‌నాల‌కు మించిన భ‌క్తులు పోటెత్త‌టం. దీంతో.. అధికారులు చేసిన ఏర్పాట్లు ఒక మూల‌కు రావ‌టం లేదు. దీంతో.. ఏర్పాట్లు చేసి మ‌రీ తిట్లు తినాల్సిన బాధ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద ప‌డుతోంది. తాజాగా జోగిని శ్యామ‌ల ఆవేద‌న‌ను చూస్తే.. కేసీఆర్ ప‌రిస్థితి త‌లుచుకుంటో అయ్యో అనుకోకుండా ఉండ‌లేం.

మ‌హిళ‌లు ఒక్కొక్క‌రూ దాదాపు 10 కేజీల బ‌రువు బోనంతో లైన్లో నిలుచున్నార‌ని.. అవేమీ ప‌ట్టించుకోకుండా వీఐపీలు వ‌స్తున్నారంటూ గంట‌ల త‌ర‌బ‌డి భ‌క్తుల క్యూలైన్లు ఆపేశారంటూ జోగిని శ్యామ‌ల మండిప‌డ్డారు. ఏడుస్తూ.. ప్ర‌భుత్వాన్ని.. ప్ర‌భుత్వ అధినేత‌పైనా శాప‌నార్థాలు పెట్టారు. వీఐపీలు వ‌చ్చిన సంద‌ర్భంగా జ‌రిగిన తోపులాట‌కు కొంద‌రు మ‌హిళ‌లు కూడా కంట‌త‌డి పెట్టారు.

త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వంతో వారు అమ్మ‌వారిని ద‌ర్శించుకోకుండా వెనుదిరిగారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అంటూ మండిప‌డిన జోగిన శ్యామ‌ల‌.. మ‌హిళ‌లు కంట‌త‌డి పెట్టేలా చేసిన కేసీఆర్ స‌ర్కారుకు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గెలిచే అవ‌కాశమే లేద‌ని మండిప‌డ్డారు. పండుగ‌లు.. వేడుక‌ల్ని భారీగా నిర్వ‌హించాల‌నుకోవ‌టం ఒక ఎత్తు. అయితే.. ఆ సంద‌ర్భంగా సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జ‌రుగుతున్నాయా? లేదా? అన్న‌ది చూడాల్సిన బాధ్య‌త అంత‌రి మీదా ఉంది. లేని ప‌క్షంలో ఖ‌ర్చు చేసి మ‌రీ తిట్లు తినాల్సిన ప‌రిస్థితి ప్ర‌భుత్వం మీద ఉంటుంద‌న్న‌ది సీఎం కేసీఆర్ గుర్తిస్తే మంచిది.