Begin typing your search above and press return to search.

స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి విన్నారా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   31 July 2018 5:01 AM GMT
స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి విన్నారా కేసీఆర్‌?
X
న‌మ్మ‌కాలు ఎక్కువ‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌డిచిన రెండు రోజులుగా హాట్ టాపిక్ అంశాల మీద దృష్టి సారించారో లేదో? గుళ్లకు ఎక్కువ‌గా వెళ్ల‌టం.. జాత‌కాలు.. వాస్తు మీద ఆస‌క్తి చూపించేఆయ‌న‌.. భ‌గ‌వంతుడి మీద భ‌యం.. భ‌క్తి ఎక్కువ‌నే చెబుతారు. మ‌రి.. అలాంటి ఆయ‌న‌కు చికాకు పెట్టే మాట‌లు.. రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హంకాళి బోనాల సంద‌ర్భంగా జోగిని శ్యామ‌ల కేసీఆర్ స‌ర్కారు తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. తాజాగా.. భ‌విష్య‌వాణిని వినిపించిన స్వ‌ర్ణ‌ల‌త సైతం త‌న అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఒక ద‌శ‌లో ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది.

బోనాల్ని బ్ర‌హ్మండంగా ఏర్పాటు చేసిన‌ట్లుగా నిర్వాహ‌కులు చంక‌లు గుద్దుకుంటున్న వేళ‌.. బోనాల నిర్వ‌హ‌ణ‌పై భ‌విష్య‌వాణి చెప్పిన స్వ‌ర్ణ‌ల‌త అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బోనాలెత్తుకు వ‌చ్చిన ఆడ‌బిడ్డ‌లు దుఃఖంతో తిరిగి వెళ్లార‌ని.. ఇంత‌మంది ఉన్నా ఏం లాభ‌మంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఒంటినిండా ప‌సుపు పులుముకొని.. నుదుట కుంకం ధ‌రించి.. తంబూరా చేత‌ప‌ట్టి.. మాంగేశ్వ‌రి ఆల‌యం ఎదుట ప‌చ్చి కుండ‌పై నిలిచిన స్వ‌ర్ణ‌లత‌.. అమ్మ‌వారిని ఆవ‌హించుకున్నారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య వాణిని వినిపించారు.

ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఈ ఏడాది బంగారు బోనం స‌మ‌ర్పించినందుకు సంతోషంగా ఉన్నావా అమ్మా? అని ప్ర‌శ్నించ‌గా.. భ‌విష్య‌వాణి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. నా బోనం నాకు స‌మ‌ర్పిస్తే సంతోషం ఎలా క‌లుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఈ ఏడాది భ‌క్తులు సంతోషంగా లేర‌ని.. ఏర్పాట్లు స‌రిగా లేని కార‌ణంగా ఇబ్బందులు ప‌డ్డ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. నా బిడ్డ‌ల్ని ఇబ్బంది పెట్టొద్దు.. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నామ‌ని మీరు అనుకుంటున్నారు.. కానీ కీడే చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

బంగారు బోనం స‌మ‌ర్పిస్తే.. పిల్లి శాప‌నార్థాలు పెట్ట‌టం ఏమీ బాగోలేదంటూ పృశ్చ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా.. భ‌విష్య‌వాణి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. న‌న్ను ప్ర‌శ్నించేంత‌టి వాడివ‌య్యావా? అంటూ మండిప‌డ‌ట‌మే కాదు.. క‌ళ్ల‌తో చూసిన విష‌యాలే మాట్లాడాల‌ని మంద‌లించింది. వ‌జ్రంతో పొదిగిన ముక్కుపుడ‌క‌.. వ‌జ్రంతో చేయించిన బొట్టు.. బంగారు ఖ‌డ్గం కూడా త‌యారు చేసి ఇచ్చామ‌ని.. నీ కీర్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని ఇవ‌న్నీ చేసిన నీ బిడ్డ‌ను.. నీ ద‌గ్గ‌ర పెరిగిన నాయ‌క‌త్వాన్ని ఆశీర్వ‌దించాల్సింది పోయి.. శాప‌నార్థాలు పెడితే ఎలా? అంటూ ప్ర‌శ్నించ‌గా.. తాను పిల్లి శాపాలు పెట్టటం లేద‌ని.. ప్ర‌జ‌లే పెడుతున్నార‌ని పేర్కొంది. త‌న‌కు అంతా స‌మాన‌మేన‌ని.. త‌న‌కు బంగారు బోనం చేయించిన బిడ్డ‌నే కాదు.. అంద‌రిని ఆశీర్వ‌దిస్తాన‌ని పేర్కొంది. వ‌ర్షాలు కురుస్తాయ‌ని.. మ‌రికొద్ది రోజుల్లోనే వ‌ర్షాభావం కొర‌త తీరుతుంద‌ని పేర్కొంది. ఆడాళ్ల క‌న్నీరు ఊరికే పోదంటూ మొన్న‌టికి మొన్న జోగిని శ్యామ‌ల శాప‌నార్థాలు పెడితే.. తాజాగా భ‌విష్య వాణి సైతం ఆగ్ర‌హ‌పు వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌మ‌నిస్తున్నారా? త‌న స్థాయికి ఇవన్నీ పెద్ద విష‌యాలు కావ‌ని అనుకుంటున్నారా?