Begin typing your search above and press return to search.

జానీమూన్ తాజా వ్యాఖ్య‌లు వింటే షాకే!

By:  Tupaki Desk   |   26 Dec 2016 4:07 AM GMT
జానీమూన్ తాజా వ్యాఖ్య‌లు వింటే షాకే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంఘిక సంక్షేమా శాఖా మంత్రి రావెల కిశోర్ బాబు-గుంటూరు జిల్లాపరిషత్ చైర్ ప‌ర్స‌న్ జానీమూన్ మ‌ధ్య నెల‌కొన్ని వివాదం అనూహ్య రీతిలో ముగిసిపోయింది. అయితే అనూహ్య‌మైన ట్విస్ట్ ఏమిటంటే...ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్ష వైసీపీపై జానీమూన్ విమ‌ర్శ‌లు చేస్తూ త‌మ పార్టీ వివాదం అంటుకొత్త విశ్లేష‌ణ చేశారు. అయితే జానీమూన్ మీడియాతో మాట్లాడ‌లేదు. ఆమె బ‌దులుగా..జానీమూన్ పేరిట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న సారాంశం ఇది. "నాకు, మంత్రికి మ‌ధ్య ఉన్నది తెలుగుదేశం కుటుంబ సమస్య. మా పార్టీ అగ్ర నాయకత్వం సమస్యను పరిష్కరించడం జరిగింది. మా పార్టీ కుటుంబ సమస్యలో వైకాపా దూరి మతం రంగు పూసే కుట్ర చేస్తున్నది. వైకాపా తన రాజకీయ ప్రయోజనం కోసం మతాన్ని దుర్వినియోగపరచి అశాంతి పెంచే కుట్రలు చేస్తున్నది" అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

"గతంలో మర్రి చెన్నారెడ్డిని పదవి నుంచి దించడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో మతచిచ్చుపెట్టి ఎన్నో మైనారిటీ ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారు. తెలుగుదేశం పాలనలోనే హైదరాబాద్‌ లో మత సామరస్యం ప‌రిడ‌విల్లింది. చంద్రబాబు పాలనలోనే మైనారిటీలకు, మహిళలకు ఎంతో ల‌బ్ది చేకూరింది. ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనం, ముస్లిం యువతుల వివాహానికి రూ.50 వేల సహాయం, రంజాన్ తోపాలు లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 18 జిల్లాలో రెండు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు కేటాయించారు. ఏలూరు మేయర్ స్థానాన్ని ముస్లిం మహిళకు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నవి. తల్లిపిల్ల కాంగ్రెస్ ముస్లింలకు చేసినంత ద్రోహం మరెవ్వరూ చేయలేదు. చివరకు వక్స్ భూములను కూడా వైఎస్ అనుచరులు కబ్దా చేశారు. తెలుగుదేశం కుటుంబ వ్యవహారాల్లో దూరవద్దని, స్వార్ణ రాజకీయాల కోసం మత చిచ్చు పెట్టే కుట్రలను మానుకోవాలని వైకాపాను కోరుతున్నాను. లేకుంటే మైనారిటీ ప్రజలే వైకాపాకు తగు బుద్ధి చెబుతారు" అంటూ జానీమూన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఎక్క‌డ కూడా రావెల‌తో వివాదం ఏ విధంగా ముగిసింద‌నే విష‌యంలో ఈ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో క్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/