Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో జోకులే జోకులు కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Sep 2016 6:10 AM GMT
సోషల్ మీడియాలో జోకులే జోకులు కేసీఆర్
X
మంచి కానీ చెడు కానీ.. పొగడ్త కానీ తెగడ్త కానీ.. మమకారం కానీ ఎటకారాన్ని కానీ జనాలు తమ దగ్గరేదీ దాచుకోవటం లేదు. తమ మనసులోని ఫీలింగ్స్ ను ఇట్టే షేర్ చేసేసుకుంటున్నారు. ఇష్యూ చిన్నదైనా.. రియాక్షన్ మాత్రం పెద్దదిగా ఉంటోంది. తమకు నచ్చిన విషయాన్ని షేర్ చేస్తూ ఎంతలా ప్రచారం చేస్తున్నారో..నచ్చని విషయాల్ని సైతం వైరల్ చేసేందుకు వెనుకాడటం లేదు. దీనికి తోడు.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఈ ధోరణిని మరింత పెంచి పోషించేందుకు అవకాశం ఇస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు.. ప్రభుత్వాధినేతలు అప్రమత్తంగా ఉండాలి. అద్యంతం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వానికి నష్టం వాటిల్లే చర్యలు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో (దాదాపుగా) అవినీతి మకిలి అంటలేదని.. ఆ విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా ప్రస్తావించారంటూ ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పుకోవటం కనిపిస్తుంది. అవినీతి మరక లేకుండా పాలన చేస్తున్నాం కాబట్టి.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు భరిస్తారనుకుంటే తప్పే అవుతుంది.

గడిచిన ఐదు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ఎంతలా అతలాకుతలం అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వాలు ఆపే స్థాయిలో ఉండవన్నది నిజమే అయినా.. సకాలంలో స్పందించి.. సమర్థంగా ప్రయత్నిస్తే నష్టాన్ని వీలైనంతగా తగ్గించే అవకాశం ఉంది. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యిందన్న భావన సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చేస్తున్న పోస్టులతో కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గడిచిన రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులకు గడిచిన రెండు నెలల్లో చాలావరకూ డ్యామేజ్ జరిగిందని చెప్పక తప్పదు. మల్లన్నసాగర్ లాంటి ఇష్యూలను పక్కన పెడితే.. చిన్న చిన్న వర్షాలకు హైదరాబాద్ రోడ్లు గుంతల మయంగా మారిపోయినా పట్టించుకోని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా.. పాడైపోయిన రోడ్ల కారణంగా తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జాంలు నగర జీవిని తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి.

ఇవి చాలవన్నట్లుగా గడిచిన ఐదు రోజులుగా దంచి కొడుతున్న వర్షాలతో పరిస్థితి ఆగమాగమైంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వేగంగా రియాక్ట్ అయి సహాయక చర్యలు చేపట్టి.. ప్రజలకు అండగా నిలిస్తే వ్యవహారం వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా వ్యవహరించటం.. అధికారుల పని తీరు దారుణంగా ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం ఓ రేంజ్ కు చేరుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టింగ్ లు చూస్తే.. జనాగ్రహం ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గడిచిన రెండున్నరేళ్లలో కేసీఆర్ చెప్పిన మాటల మీద సోషల్ మీడియాలో ఎటకారపు పోస్టింగ్ లు రాలేదని చెప్పాలి. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి ఏ మాట వచ్చినా.. దానికి కౌంటర్ అన్నట్లుగా పంచ్ పడేలా పోస్టింగ్ లు వచ్చాయి. చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ మీద జోకులు చాలా తక్కువ. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారింది. గడిచిన ఐదు రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థితి మారిపోయింది. వాట్స్ అప్.. ఫేస్ బుక్ లలో తరచూ దర్శనమిస్తున్న పోస్టింగులు ఎటకారంగా ఉండటమే కాదు.. కేసీఆర్ అండ్ కోను విపరీతంగా అభిమానించే వారిని.. ఆరాధించే వారిని తీవ్రంగా బాధిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎవరినీ అడ్డుకునే పరిస్థితి ఉండదు కదా. సాధారణంగా ఎవరి పైనైనా ఎటకారం చేస్తూ పోస్టింగ్ లు పెడితే.. దానికి కౌంటర్ గా మరికొన్ని పోస్టింగులు బయటకు వస్తుంటాయి. కానీ.. తాజాగా మాత్రం అలాంటి పరిస్థితి కనిపించకపోవటం గమనార్హం. సోషల్ మీడియాలో పెరుగుతున్న ఎటకారపు పోస్టింగ్ లు కేసీఆర్ సర్కారుపై జనాగ్రహానికి నిదర్శమన్న విషయాన్ని గుర్తించి పాలకులు అలెర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.