Begin typing your search above and press return to search.

జాలీ హత్యలు ఆరు కాదు.. అంతకు మించే ఉన్నాయా?

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:05 AM GMT
జాలీ హత్యలు ఆరు కాదు.. అంతకు మించే ఉన్నాయా?
X
ఆస్తి కోసం మానవత్వానికి మంటగలిపేలా భర్తతో సహా అత్తమామల్ని.. కుటుంబ సభ్యుల్ని ఒకరి తర్వాత ఒకరు చొప్పున హత్య చేసిన జాలీ ఉదంతం కేరళలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరుగురు అయినోళ్లను హతమార్చిన వైనం విన్నోళ్లంతా విస్మయానికి గురి కావటమే కాదు..ఆమె తీరును ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి ఆలోచనలు ఆమె చేసిన హత్యల చుట్టూ తిరుగుతుంటే.. కేరళ పోలీసుల ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి.

ఇప్పటికి బయటకు వచ్చిన ఆరు హత్యలకే జాలీ పరిమితమైందా? మరిన్ని హత్యలు చేసి ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరిన్ని హత్యలు ఆమె చేసి ఉంటుందన్న అనుమానంతో వారు ఉన్నారు. వారి సందేహాలకు బలం చేకూర్చేలా మరికొన్ని ఉదంతాలు తెర మీదకు వస్తున్నాయి. రెండో భర్త భార్య సిలీ.. వారి కుమార్తె అయిన రెండేళ్ల అల్ఫైన్ మరణం వెనుక కూడా జాలీ ఉందా? అన్నది ఇప్పుడొస్తున్న క్వశ్చన్.

ఈ అంశంపై జాలీ రెండో భర్త షాజును విచారిస్తున్నారు. అనుమానాస్పద మరణాల వెనుక జాలీ ఉందన్న విషయం తనకు తెలీదని పోలీసుల విచారణలో అతను చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీన్ని నమ్మని పోలీసులు..తమదైన శైలిలో విచారించగా.. తన మొదటి భార్య.. కుమార్తెల హత్య కుట్రలో తాను పాలు పంచుకున్న విషయాన్ని వారు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. జాలీని అరెస్ట్ చేసిన వైనంతో అలెర్ట్ అయిన షాజు ఇంట్లోని వస్తువుల్ని.. కంప్యూటర్ ను వేరే ప్రాంతానికి తరలిస్తున్న విషయాన్ని గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

జాలీని విచారించిన పోలీసులకు.. తాను చేసిన హత్యల సమాచారాన్ని తన రెండో భర్తకు చెప్పిన వైనాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో.. బయటకు వచ్చిన ఆరు హత్యలతో పాటు మరిన్ని హత్యలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జాలీతో నిత్యం టచ్ లో ఉండే పదకొండుమందిని గుర్తించి విచారిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జాలీతో ఆర్థిక సంబంధాలు ఉన్న మరో మహిళ.. అతనితో సంబంధం ఉన్న స్థానిక కాంగ్రెస్ నేత మరణం వెనుక కూడా జాలీ ఉండొచ్చని భావిస్తున్నారు. వరుస హత్యల విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసిన రాయ్ థామస్ సోదరు రోజో కూడా హత్యకు గురి కావాల్సి ఉందట. ఆస్తి కోసం అతడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. విదేశాల్లో ఉండటంతో బతికిపోయినట్లు చెబుతున్నారు.