Begin typing your search above and press return to search.

బ‌ర్ఖాద‌త్‌ ను అంత‌లా వేధిస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   9 Jun 2018 11:21 AM GMT
బ‌ర్ఖాద‌త్‌ ను అంత‌లా వేధిస్తున్నార‌ట‌!
X
దేశంలో గ‌ల్లీ స్థాయి నుంచి జ‌ర్న‌లిస్టులు చాలామందే ఉన్నారు. కానీ.. కొంద‌రు మాత్ర‌మే సెల‌బ్రిటీ హోదాను క‌లిగి ఉంటారు. అలాంటి సెల‌బ్రిటీ స్టేట‌స్ ఉన్న జ‌ర్న‌లిస్టుల్లో బ‌ర్ఖాద‌త్ ఒక‌రు. గ‌తంలో ఎన్డీటీవీలో ప‌ని చేసిన ఆమె.. ఆ మ‌ధ్య‌న బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం కొత్త ఛాన‌ల్ పెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన కొద్దికాలంగా త‌న‌ను జ‌ర్న‌లిజానికి దూరంగా ఉండాలంటూ భారీ ఎత్తున హెచ్చ‌రిక‌లు ఇస్తున్న‌ట్లుగా ఆమె చెప్పారు. భార‌త్ లాంటి ప్ర‌జాస్వామ్య దేశంలో త‌న‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని భావించాన‌ని.. కానీ.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితుల్ని తాను ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పారు. ఒక వ్య‌క్తిగా త‌న‌కు ఉండాల్సిన హ‌క్కుల విష‌యంలో ఎప్పుడూ లోటు రాద‌ని భావించాన‌ని కానీ అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.

త‌న ఇంటి గోడ‌ల్లో ఎన్ని నిఘానేత్రాలు ఉన్నాయో చెప్ప‌లేని ప‌రిస్థితి అన్న ఆమె.. త‌న క‌దలిక‌ల మీద నిఘా కొన‌సాగుతోంద‌న్నారు. తాను ఒక టెలివిజ‌న్ జ‌ర్న‌లిస్టుగా త‌న విధులు నిర్వ‌ర్తించ‌కుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారులో కొన్ని శ‌క్తులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు.

త‌న‌ను జ‌ర్న‌లిజం మానేసి.. ఇంట్లో కూర్చోవాల‌ని కోరుతున్నార‌ని.. లేదంటే మ‌రేదైనా ప‌ని చేసుకోవాల‌న్న మాట‌ను చెబుతున్నార‌న్నారు. ఏడాది కాలంగా త‌న‌ను వేధిస్తూ ఉన్నార‌ని.. ఈ వేధింపులు క‌ఠినంగా లేక‌పోవ‌టం.. నిరూపించేందుకు వీలు లేని విధంగా ఉండ‌టంతో తాను ఫిర్యాదు చేయ‌లేక‌పోతున్నట్లు చెప్పారు.

తాను ఎన్డీటీవీలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ప్ర‌మోట‌ర్లు వ‌చ్చి త‌న‌ను సున్నితంగా వార్నింగ్ ఇచ్చేవార‌ని.. నా కార‌ణంగా వారికి ఒత్తిళ్లు పెరిగిపోతున్న‌ట్లుగా చెప్పేవార‌న్నారు. 2019 ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కూ జ‌ర్న‌లిజానికి దూరంగా ఉండాలంటూ త‌న‌ను త‌ర‌చూ హెచ్చ‌రిస్తున్న‌ట్లుగా ఆమె చెప్పారు. ఒక ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టుకు ఇంత పెద్ద ఎత్తున హెచ్చ‌రిక‌లు (సున్నితంగా అయినా) రావటం.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తి అయ్యే వ‌ర‌కూ పాత్రికేయ వృత్తికి దూరంగా ఉండ‌మ‌ని కోర‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.