Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్లో కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చేసిన ఉద్యోగి

By:  Tupaki Desk   |   4 March 2018 5:30 PM GMT
ప్రెస్ మీట్లో  కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చేసిన ఉద్యోగి
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిస్థానంలో ఉన్న వారు త‌ర‌చూ ప్ర‌జ‌ల‌కు.. మీడియాకు అందుబాటులో ఉండ‌టం చాలామందిలో క‌నిపిస్తుంది. అందుకు పూర్తి విరుద్ధం కేసీఆర్ తీరు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రికి టైం ఇస్తారన్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. చివ‌ర‌కు ఆయ‌న వ్య‌వ‌హారాలు చూసే వారు సైతం చెప్ప‌లేక‌పోతుంటారు.

కొన్ని సంద‌ర్భాల్లో సార్ ను క‌ల‌వాల‌ని.. ముఖ్య‌మైన విష‌యం మాట్లాడాల‌ని చెప్పినంత‌నే.. వెంట‌నే మీటింగ్ అరేంజ్ చేస్తామ‌ని చెప్పి.. ఆ త‌ర్వాత ఫోన్లు ఎత్త‌కుండా ఉండే అనుభ‌వం చాలామంది సీనియ‌ర్ మీడియా మిత్రుల‌కు అనుభ‌వ‌మే. ఆ మాట‌కు వ‌స్తే.. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ తో క‌లిసి విప‌రీతంగా ప‌ని చేసేవారికి సైతం ఈ రోజున ఆయ‌న అపాయింట్ మెంట్ ఎప్పుడు దొరుకుతుందో క‌చ్ఛితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఉద్య‌మాల్లోనూ.. రాజ‌కీయాల్లోనూ స‌రికొత్త ప్ర‌మాణాలు నెల‌కొల్పిన ఘ‌న‌చ‌రిత్ర కేసీఆర్ సొంతం. తాజాగా ఆయ‌న కొత్త త‌ర‌హా అనుభ‌వాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. సాధార‌ణంగా ప్రెస్ మీట్ అంటే ఎలా ఉంటుంది? మీడియాకు తానేం చెప్పాల‌నుకున్నారో అది చెప్పేయ‌టం.. ఆ త‌ర్వాత మీడియా వారి సందేహాలు తీర్చ‌టం క‌నిపిస్తుంది.

ఉద్య‌మ నాయ‌కుడి హోదాలో మీడియాపైనా.. త‌న పార్టీ బీట్ చూసే రిపోర్ట‌ర్ల మీద విప‌రీత‌మైన ప‌ట్టు ఉన్న కేసీఆర్‌.. త‌న‌కు ఇబ్బంది క‌లిగే ప్ర‌శ్న‌లు సంధించ‌కుండా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో అన్ని తీసుకుంటారు. ఎవ‌రైనా ఉత్సాహంతో ఒక‌ట్రెండు ప్ర‌శ్న‌లు అడిగే సాహ‌సం చేస్తే.. వారిని న‌వ్వులుపాలయ్యేట‌ట్లు చేయ‌ట‌మో లేదంటే.. వారి పేరును ప్ర‌స్తావించి.. ఏందిది.. మీరు కూడా ఇలా అడుగుడు.. తెలీనివాళ్లైతే చెప్పొచ్చు.. మీరు కూడా ఇలానా? అంటూ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా త‌న‌దైన స్టైల్లో ఇష్యూను డైవ‌ర్ట్ చేస్తుంటారు.

తాజాగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో మ‌రో కొత్త సంప్ర‌దాయాన్ని తీసుకొచ్చిన‌ట్లుగా చెప్పాలి. కేంద్రంపైన తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన చారిత్ర‌క ప్రెస్ మీట్ అనంత‌రం కొంద‌రు జ‌ర్న‌లిస్టులు య‌ధావిధిగా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేయ‌టం షురూ చేశారు. స‌ద‌రు ప్రెస్ మీట్లో తొలి వ‌రుస‌లో కూర్చున్న కేసీఆర్ సొంత మీడియా సంస్థ‌కు చెందిన కీల‌క జ‌ర్న‌లిస్టు ఒక‌రు.. సార్ అంటూ ప్ర‌శ్న‌ను సంధించారు.

ఇంత‌కూ ఆ పెద్ద‌మ‌నిషి సంధించిన ప్ర‌శ్నేమిటంటే.. మోడీని మీరు గాడు అన‌లేదు.. ఆ విష‌యం ఇప్ప‌టికే రుజువైంది.. కానీ.. బీజేపీ నేత‌లు ఎందుక‌లా విమ‌ర్శిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఇంకేముంది.. కేసీఆర్ త‌న‌దైన స్టైల్లో చెల‌రేగిపోయారు. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి కేసీఆర్ ఏమ‌న్నారు? ఆ మాట అన‌టానికి ముందు.. త‌ర్వాత ఏమ‌న్నార‌న్న‌ది ఇప్ప‌టికే వాట్సాప్ ల‌లో పొట్టి వీడియోల‌లో వ‌చ్చేసింది. ఇంత జ‌రిగిన త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కుడిగా తానేం చెప్పాల‌నుకున్న‌ది కేసీఆర్ చెప్పుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. మీడియా ప్ర‌తినిధిగా ప్రెస్ మీట్లో కూర్చున్న వ్య‌క్తి.. ముఖ్య‌మంత్రుల వారికి క్లీన్ చిట్ ఇచ్చేయ‌టం ఒక ఎత్తు అయితే.. స‌ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కేసీఆర్ సొంత సంస్థ కు చెందిన కీల‌క జ‌ర్న‌లిస్టు కావ‌టం చూసిన‌ప్పుడు.. ప్రెస్ మీట్ ను ఇలా కూడా ట‌ర్న్ చేయొచ్చా? అన్న భావ‌న ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌లో క‌నిపించింది. రాజ‌కీయ నేత‌ల‌కు సొంత మీడియా సంస్థ‌లు ఉంటే ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌న‌టానికి తాజా ఉదంతం చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.