Begin typing your search above and press return to search.

ఇరాన్ ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు జైలులో

By:  Tupaki Desk   |   4 Oct 2022 11:30 PM GMT
ఇరాన్ ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు జైలులో
X
ఒక్క ఫొటోతో దేశాన్నంతటినీ కదిలించి.. ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చేలా చూసిన జర్నలిస్టు ప్రస్తుతం జైలులో ఉన్నారు. సరిగ్గా 20 రోజుల కిందటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు అట్టుడుకుతోంది. నిరసనలు, ఆందోళనలతో అతలాకుతలం అవుతోంది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 76 మంది పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇదంతా అహ్సా అమిని అనే యువతి మరణం నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాకాండ. ఇరాన్ లో హిజాబ్ ధారణ కఠినంగా అమలవుతుంది. దీనిని నిరిసిస్తూ కొందరు మహిళలు అందోళనలకు దిగుతున్నారు. ఇలాంటివారిలో అహ్సా అమిని ఒకరు. ఆమెను ఇరాన్ నైతిక ప్రవర్తన పోలీసులు (మొరాలిటీ పోలీస్) అదుపులోకి తీసుకున్నారు.

అప్పటికి ఆరోగ్యంగానే ఉన్న అమిని.. తర్వాతి రెండ్రోజులకే మరణించింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అమిని శరీరంపై గాయాలున్నాయని ఆమె తండ్రి ఆరోపించాడు. కాగా, అమిని మరణం పట్ల ఇరాన్ లో సోషల్ మీడియా హోరెత్తింది. ఏకంగా 20 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. ఇదే సమయంలో నగరాలకు నగరాల్లో ఆందోళనలు పెట్రేగాయి. మహిళలు వీధుల్లోకి వచ్చి మరీ నిరసనలకు దిగారు. హిజాబ్ లు తీసేసి.. జుత్తు కత్తిరించుకుంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఇలాంటి ఆందోళనల్లో పాల్గొంటూ కొందరు యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

వెలుగులోకి తెచ్చింది ఆమెనే..ఇరాన్ అంటే సంప్రదాయ దేశం. అలాంటిచోట ప్రజలకే కాక మీడియాకూ హద్దులుంటాయి. ఇరాన్ లో ఏం జరిగినా బయటకు అంత తొందరగా రాదు. పాలకులు దానిని అలా అణచివేస్తుంటారు. వాస్తవానికి అమిని మరణం సెప్టెంబరు 17న చోటుచేసుంది. కస్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అయినా వారం వరకు బయటకు రాలేదు. చివరకు నీలోఫర్ హమెదీ అనే మహిళ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు. "షర్గ్"పత్రికకు ఆమె పనిచేస్తున్నారు.

ట్వీట్ తో వెలుగులోకి.. అమిని మరణాన్ని హమెది ట్వీట్ ద్వారా బయటి ప్రపంచానికి చాటారు. సెప్టెంబరు 17న ఆస్పత్రిలో అమిని తల్లిదండ్రులు రోదిస్తున్న ఫొటోను హమెది ట్వీట్ చేశారు. ఈ ఫొటో కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది.

ఆ వెంటనే ఆందోళనలకు దారితీసింది. కాగా, జర్నలిస్టు హమెదిని సెప్టెంబరు 22నే పోలీసులు అరెస్టు చేశారు. భద్రతా సిబ్బంది ఆమె నివాసంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. హమెదికి చెందిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్ ఇరాన్ అతలాకుతలం కావడానికి కారణమైన హమెది ట్విటర్ ఖాతాను ఎటువంటి కారణం లేకుండానే సస్పెండ్ చేశారు. మరోవైపు అరెస్టు అనంతరం సెప్టెంబరు 25న హమెది తన భర్తకు ఫోన్ చేశారు. టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో తనను విచారిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తనపై ఏమేం అభియోగాలు మోపారనేదానిని ఆమె వెల్లడించలేదు. చిత్రమేమంటే.. అమిని మరణం వార్త వారం రోజుల తర్వాత మిగతా ప్రపంచానికి తెలియగా.. దానిని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు హమెది అరెస్టు విషయం పది రోజుల తర్వాత బయటపడింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.