Begin typing your search above and press return to search.

సుప్రీంలోకి ఫోన్ల‌తో విలేక‌రులు వెళ్లొచ్చు

By:  Tupaki Desk   |   3 July 2018 6:51 AM GMT
సుప్రీంలోకి ఫోన్ల‌తో విలేక‌రులు వెళ్లొచ్చు
X
చారిత్ర‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం. సుప్రీంకోర్టు వార్త‌ల్ని క‌వ‌ర్ చేసే మీడియా ప్ర‌తినిధులు త‌మ‌తో పాటు.. త‌మ మొబైళ్ల‌ను తీసుకెళ్లేందుకు వీలుగా అనుమ‌తినిస్తూ తాజాగా స‌ర్క్యుల‌ర్ ను జారీ చేసింది. ఈ రోజు నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ నిర్ణ‌యం అక్రిడేష‌న్ జ‌ర్న‌లిస్టుల‌తో పాటు.. నాన్ అక్రిడేష‌న్ జ‌ర్నలిస్టుల‌కు కూడా వ‌ర్తించ‌నుంది.

సుప్రీం స‌ర్య్యుల‌ర్ ప్ర‌కారం అక్రిడేష‌న్.. నాన్ అక్రిడేష‌న్ జ‌ర్న‌లిస్టులు త‌మ ఫోన్ల‌తో సుప్రీంకోర్టులోప‌ల‌కు వెళ్లొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ లాయ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ స‌దుపాయం ఉండేది. నేటి నుంచి జ‌ర్న‌లిస్టుల‌కు అవ‌కాశం ల‌భించ‌నుంది. అయితే.. కోర్టుకు ఫోన్లు తీసుకెళ్లే జ‌ర్న‌లిస్టులు.. కోర్టు హాల్లో మాత్రం త‌మ ఫోన్ల‌ను సైలెంట్ మోడ్ లోనే ఉంచాలి. ఒక‌వేళ‌.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం వారిపై చ‌ర్య‌లు తీసుకునే వీలుంది.

అయితే.. సుప్రీంకోర్టు లోప‌ల‌కు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లే వారు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రీ ఇచ్చిన పాస్ ను త‌మ‌తో ఉంచుకోవాలి. ఆర్నెల్ల కాల వ్య‌వ‌ధి ఉన్న ఈ పాస్ తోనే మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లే వీలుంది. మొబైల్ ఫోన్ తో కోర్టు కార్య‌క‌లాపాల్ని చిత్రీక‌రించ‌కూడ‌దు. ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తే మాత్రం వారిపై చ‌ర్య‌లు తీసుకుంటారు.

తొలుత అక్రిడేష‌న్ ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే ఫోన్ల‌కు అనుమ‌తిని ఇవ్వాల‌ని సుప్రీం భావించినా.. నాన్ అక్రిడేష‌న్ జ‌ర్న‌లిస్టుల విన‌తితో వారికి కూడా ఫోన్ల‌ను తీసుకెళ్లే స‌దుపాయాన్ని క‌ల్పించారు. తాజా ప‌రిణామంతో కోర్టు వార్త‌లు మ‌రింత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుంది. గ‌తంలో కోర్టు ప్రోసీడింగ్స్ అయ్యాక‌.. కోర్టు హాలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాతే మీడియా సంస్థ‌ల‌కు కోర్టు లోప‌ల ఏం జ‌రిగింద‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చేది. తాజా నిర్ణ‌యంతో కోర్టు హాల్లో జ‌రిగే కార్య‌క‌లాపాలు ఎప్ప‌టిక‌ప్పుడు మేసేజ్ ల రూపంలో విలేక‌రులు మీడియా సంస్థ‌ల‌కు స‌మాచారాన్ని అందించే అవ‌కాశం క‌లుగుతుంది.