Begin typing your search above and press return to search.

ఏమాటకామాటే..‘‘మీ కేసీఆర్ మొనగాడండోయ్’’

By:  Tupaki Desk   |   17 March 2016 5:30 PM GMT
ఏమాటకామాటే..‘‘మీ కేసీఆర్ మొనగాడండోయ్’’
X
రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన జర్నలిస్టులు ఇద్దరు తమ వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. వారికి తెలుగు రాజకీయాల మీద కాస్తంత పట్టుంది. ఇక.. హైదరాబాద్ లోకి అడుగు పెట్టింది మొదలు.. వారు తెలుగు రాజకీయాల గురించి ప్రస్తావించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడేయటం ఆసక్తికరంగా అనిపించక మానదు. ఉత్తపుణ్యానికే వారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడేస్తున్నారంటే తప్పులో కాలేసినట్లే. వారు చూపిస్తున్న కారణాలు లాజిక్ గా ఉండటంతో వారి మాటల్ని కాస్త ఆసక్తితో వినాల్సిందే.

ఇంతకీ వారు చెప్పేదేమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణకు తలనొప్పులు ఖాయమని వారు భావించారట. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉన్న పాలనా అనుభవం ముందు కేసీఆర్ తేలిపోవటమే కాదు.. ఆయన స్పీడ్ ముందు కారు జోరుగా నడిచే అవకాశం లేదని భావించారట. దీనికి తోడు.. విద్యుత్ సమస్య తెలంగాణకు శాపంగా మారి.. తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడటమే కాదు.. కేసీఆర్ సర్కారు మీద తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురి కావటం ఖాయమన్న అంచనాలు ఉండేవని.. కానీ.. ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెబుతున్నారు.

విద్యుత్ సమస్య ఇష్యూలో మీ ముఖ్యమంత్రి ఏం మేజిక్ చేశారో మాకు అస్సలు అర్థం కావటం లేదని చెబుతున్న సదరు జర్నలిస్టులు.. తమ రాష్ట్రం గురించి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన కరెంటు కోతల్ని ఎదుర్కొంటుందని.. ఐటీకి ఐకాన్ గా చెప్పుకునే బెంగళూరు మహానగరంలో నిత్యం తక్కువలో తక్కువ 4 గంటల నుంచి 6 గంటల వరకు పవర్ కట్ ఉందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో చెట్లను కొట్టేయటం.. భవనాల అనుమతులు భారీగా ఇవ్వటంతో గార్డెన్ సిటీ కాస్తా కాంక్రీట్ జంగిల్ గా మారి.. చెమటలు కారుతున్నాయని చెబుతున్నారు.

ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎండలు ఇప్పుడే మంట పుట్టిస్తున్నాయని.. ఫ్యాన్ వేసుకోనిదే బతకలేని పరిస్థితి ఉందని.. పొద్దున.. సాయంత్రం.. రాత్రి అన్న తేడా లేకుండా పవర్ కట్ లు ఉండటంతో మహానగర ప్రజలు నుంచి.. గ్రామాల్లోని ప్రజల వరకూ తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు. మీకు నిమిషం కూడా పవర్ కట్ లేదంట కదా అని ప్రస్తావించిన సదరు జర్నలిస్ట్ లు.. చివర్లో.. ‘‘మీకు కేసీఆర్ ఉన్నాడు. మాకు లేడు కదా. ఎంతైనా మీవోడు మొనగాడు’’ అంటూ మక్తాయించటం గమనార్హం. మార్చిలో ఎండలు మండుతున్న వేళ.. పవర్ కట్ అన్నది లేకుండా సాగిపోతున్న వేళ.. పక్క రాష్ట్రం వాళ్ల వెతలు వింటే.. మీకు పవర్ కట్స్ ఉన్నాయా? అని ఆశ్చర్యపోవటం.. మనకు అలాంటి తిప్పలు లేవన్న సంతోషం కలగటం ఖాయం.