Begin typing your search above and press return to search.

సుప్రీం జ‌డ్జిల‌ను విలేక‌రులు వేసిన ప్ర‌శ్న‌లేమిటి?

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:56 AM GMT
సుప్రీం జ‌డ్జిల‌ను విలేక‌రులు వేసిన ప్ర‌శ్న‌లేమిటి?
X
అనూహ్యం. అసాధార‌ణం. ఊహ‌కు అంద‌నిది. ఇలాంటి మాట‌లు ఎన్ని చెప్పినా జ‌రిగిన ఘ‌ట‌న‌తో పోల్చిన‌ప్పుడు త‌క్కువే అవుతుంది. కోర్టు వార్త‌ల్ని క‌వ‌ర్ చేసే వారంతా.. జ‌డ్జి చెప్పింది రాసుకోవ‌ట‌మే త‌ప్పించి ప్ర‌శ్న‌లు వేయ‌టం ఉండ‌దు. ఆ మాట‌కు వ‌స్తే ఒక సాధార‌ణ న్యాయ‌మూర్తి మొద‌లుకొని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి వ‌ర‌కూ మీడియా ముందుకు రావ‌టం ఉండ‌దు. ఒక‌వేళ వ‌చ్చినా.. స‌మావేశంలో తామేం చెప్పాల‌నుకున్న‌ది చెప్పేస్తారు త‌ప్పించి.. విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేయ‌టం ఉండ‌దు.

అలాంటిది దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టుకు చెందిన న‌లుగురు న్యాయ‌మూర్తులు.. త‌మ స‌హ‌చ‌ర న్యాయ‌మూర్తి ఇంట్లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టమే కాదు.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌టం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ మీద ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ విలేక‌రుల స‌మావేశంలో విలేక‌రులు సుప్రీంకోర్టు జ‌డ్జిల‌కు వేసిన ప్ర‌శ్న‌లేంటి? వాటికి వారిచ్చిన స‌మాధానాలు ఏమిటి? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

ఎందుకంటే.. విలేక‌రుల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక వివాదాంశం మీద సుప్రీంకోర్టు జ‌డ్జిల‌ను మీడియా ప్ర‌తినిధులు వ‌రుస‌గా ప్ర‌శ్న‌లు వేసింది లేదు. సినిమాటిక్ గా చోటు చేసుకున‌న ఈ ఉదంతంలో జ‌ర్న‌లిస్టులు వేసిన ప్ర‌శ్న‌లు.. వాటికి సుప్రీం న్యాయ‌మూర్తులు ఇచ్చిన స‌మాధానాలు చూస్తే..

విలేక‌రులు: మీరిప్పుడేం ప‌రిష్కారం కోరుకుంటున్నారు? చీఫ్ జ‌స్టిస్ ను అభిశంసించాలా?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: మేం ఏమీ చెప్ప‌టం లేదు. దేశ‌మే దీనిపై నిర్ణ‌యం తీసుకోవాలి.

విలేక‌రులు: మీడియా స‌మావేశానికి మిమ్మ‌ల్ని పురిగొల్పిన అంశం ఏమిటో చెబుతారా?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: కొన్ని నెల‌లుగా మేం సంత‌కం చేసిన లేఖ‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఇచ్చాం. దాన్ని ఇప్పుడు మీకిస్తాం. కొన్ని విష‌యాల్లో నిర్దిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మేం కోరాం. అప్పుడు చ‌ర్య‌లైతే తీసుకున్నారు కానీ దాని త‌ర్వాత ఎన్నో ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. సుప్రీం సంస్థ నిబ‌ద్ధ‌త‌పై కొత్త అనుమానాలు త‌లెత్తేలా చేసిన‌ట్లు మేం న‌మ్ముతున్నాం. ఇంకా ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ రోజు ఉద‌యం కూడా న‌లుగురం సీజే ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఒక విన‌తి చేశాం. కొన్ని విష‌యాలు స‌రిగా లేవు. వాటిని స‌రిదిద్దాల‌న్నాం. దేశంలో అత్యంత సీనియ‌ర్ జ‌డ్జిలు వెళ్లి విన‌తులు చేస్తున్నాం ఫ‌లితం లేదు.

విలేక‌రులు: మీరు ప్ర‌స్తావిస్తున్న‌ది జ‌డ్జి లోయా కేసా? మీరు ఎందుకు గోప్య‌త పాటిస్తున్నారు?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: అంద‌రికి అన్ని విష‌యాలు తెలుసు. మేం ఇక్క‌డ‌కు రాజకీయాలు చేయ‌టానికి రాలేదు. మేం విడుద‌ల చేసే లేఖ చూస్తే.. మేం ఎలాంటి కంప్లైంట్ చేశామో అర్థ‌మ‌వుతుంది. అన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతాయి.

విలేక‌రులు: ఏదైనా అంశం గురించి లేఖ‌లో ఉందా?

జ‌స్టిస్ రంజ‌న్ గోగోయ్‌: ఒక కేసు అప్ప‌గింత‌కు సంబంధించిన అంశాల్ని ఆ లేఖ‌లో ప్ర‌స్తావించాం.

విలేక‌రులు: అది జ‌డ్జి లోయా విష‌య‌మా?

జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌: అవును

విలేక‌రులు: రాజ్యాంగ ధ‌ర్మాస‌నంలో సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల్ని విస్మ‌రించార‌న్న‌దే మీ అభ్యంత‌ర‌మా?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: మేం విడుద‌ల చేసిన లేఖ చ‌దివితే మీక‌న్ని స‌మాధానాలు వ‌స్తాయి.

విలేక‌రులు: దీన్ని నిర‌స‌న అనుకోవ‌చ్చా?

జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌: దేశం ప‌ట్ల మా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌నుకున్నాం. చెప్పాల్సిందంంతా చెప్పాం.

విలేక‌రులు: క‌ట్టుబాట్ల‌కు అతీతంగా అత్యంంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తులు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు క‌దా? ఇకపై సుప్రీంకోర్టు పాల‌న ఎప్ప‌టిలా మామూలుగా.. సుహృద్భావ‌పూర్వ‌కంగా జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారా?

జ‌స్టిస్ లోకూర్: క‌ట్టుబాటును ఎవ‌రూ త‌ప్ప లేదు.

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: మేం మా త‌ర‌ఫునే మాట్లాడుతున్నాం. మేం ఎవ‌రితో చ‌ర్చించ‌లేదు.

విలేక‌రులు: ఈ విలేక‌రుల స‌మావేశం చీఫ్ జ‌స్టిస్‌ కు వ్య‌తిరేకంగా అవిశ్వాసం అనుకోవ‌చ్చా?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: మీ అభిప్రాయాలు మాకు అపాదించొద్దు.

విలేక‌రులు: మీ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏమిటి?

జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌: రేపు.. ఎల్లుండి శ‌ని.. ఆదివారాలు. కేసుల విచార‌ణ‌కు సోమ‌వారం కోర్టుకు వెళ్తాం.

విలేక‌రులు: దీన్ని నిర‌స‌న అనుకోవ‌చ్చా?

జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌: దేశం ప‌ట్ల మా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించాల‌నుకుంటున్నాం. చెప్పాల్సిందంతా చెప్పేశాం.