Begin typing your search above and press return to search.

లోగుట్టు:బాబు గెలుపు.. వారి మెడకు చుట్టుకుంది..

By:  Tupaki Desk   |   26 April 2019 4:13 AM GMT
లోగుట్టు:బాబు గెలుపు.. వారి మెడకు చుట్టుకుంది..
X
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. ’ చంద్రబాబు గెలవాలని టీడీపీ అనుకూలురు.. వైసీపీ గెలవాలని ఆ పార్టీకి సానుభూతిపరులు కోరుకోవడం సహజం. కానీ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు జర్నలిస్టులకు ఇప్పుడు విపత్కర పరిస్థితి ఎదురైందట.. బాబు ఇష్టం లేకున్నా ఆయనే గెలవాలని కోరుకోవాల్సిన పరిస్థితి టీడీపీ అనుకూల మీడియా జర్నలిస్టులకు వచ్చింది.. బాబు గెలుపుకు జర్నలిస్టులకు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా.? ఇక్కడే ఉంది పితలాటకం..

ఉద్యోగులన్నాకా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు - ప్రమోషన్ల కోసం కోసం ఎదురుచూడడం సహజం.. టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో టీడీపీ అనుకూల మీడియా పంట పండింది. నాలుగేళ్లుగా టీడీపీ అనుకూల మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు 25శాతం నుంచి 30శాతం వరకూ ప్రతి సంవత్సరం జీతాలు పెరిగాయి. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన జీతాలకు దాదాపు డబుల్ అయ్యాయి. అయితే 5వ సంవత్సరం మాత్రం పెంపు గింపు లేకుండా పోయింది. ప్రతి మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త లెక్క. అంటే మీడియా సంస్థలన్నీ ఏప్రిల్ నెల పెంచితే మే 1న ఆ హైక్ ను జర్నలిస్టులకు వర్తింపచేస్తాయి. కానీ ఈసారి మాత్రం జర్నలిస్టులకు మొండిచేయే చూపారట.. కారణం ‘చంద్రబాబు గెలుపు’పై ఆశలు లేకపోవడమే..

చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ టీడీపీ అనుకూల మీడియా పంట పండడం.. వారి జీతాలు భారీగా పెరగడం ఖాయమవుతుంది. కానీ బాబు అధికారంలోకి రాకపోతే గడ్డు పరిస్థితే. వచ్చే ఐదేళ్లు వైసీపీ పాలనను తట్టుకొని నిలబడాలి. అందుకే ఇప్పుడు టీడీపీ మీడియా అలెర్ట్ అయ్యిందట. ప్రతి సంవత్సరం మే1 జీతాలు పెంచడాన్ని రద్దు చేసుకున్నాయి. మే 23న ఫలితాలు చూశాక బాబు గెలిస్తే పండుగ.. లేదంటే ఎండుగే అని జర్నలిస్టులకు స్పష్టం చేశాయట.. దీంతో ఇష్టం లేకున్నా.. ఇప్పుడు జర్నలిస్టులందరూ ‘ద్యేవుడా బాబు గెలుపు మా సావుకొచ్చిందే’ అని ఆయన గెలుపు కోసం కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చంద్రబాబు తన సామ్రాజ్యాన్ని పాపులారిటీని ఏర్పరుచుకున్నదే మీడియాపైన.. టీడీపీ అనుకూల మీడియా వల్లే బాబు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు వెన్నుదన్నుగా ఉండే మీడియా కూడా ఇప్పుడు చంద్రబాబు గెలుపును సందేహిస్తుండడం గమనార్హం. కొంపదీసి నమ్మకం లేకనే ఇలా జీతాల పెంపును వాయిదా వేసుకున్నాయా.? అంటే బాబు గెలవడా అన్న ఆందోళన టీడీపీ శిబిరంలో ఆందోళన కు కారణమవుతోంది. మీడియా అంటే విస్తృత సమాచార సేకరణ ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి పరిస్థితులు పసిగట్టే సామర్థ్యం ఉంటుంది.. వాళ్లే చంద్రబాబు గెలుపు కోసం ఆగారంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టే లెక్క కదా.?