Begin typing your search above and press return to search.

ఆద‌ర్శ ప్రాయంగా సాగిన గౌతం రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం..

By:  Tupaki Desk   |   21 Feb 2022 5:30 AM GMT
ఆద‌ర్శ ప్రాయంగా సాగిన  గౌతం రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం..
X
ఏపీ కేబినెట్‌లో యువ మంత్రిగా, వివాదాల‌కు దూరంగా ఉండే మేక‌పాటి గౌతంరెడ్డి ఇక లేరు. రాజ‌కీయాల్లో అతిత‌క్కువ కాల‌మే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారే త‌ప్ప‌.. ఇత‌ర నేత‌ల మాదిరిగా.. దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. ముఖ్యంగా నిర్మాణాత్మ‌క‌ రాజ‌కీయాల‌కు గౌతం రెడ్డి కేంద్రంగా ఉన్నార‌నే చెప్పాలి.

తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గౌతం రెడ్డి.. రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం ద‌క్కించుకున్నారు.

2014, 2019లో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన గౌతంరెడ్డి.. ప్ర‌స్థానం ఆద‌ర్శ‌వంతంగానే ముందుకు సాగింది. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు త‌ల్లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌స్య ఏదైనా.. ఎలాంటిదైనా.. ప‌రిష్క‌రించే వ‌ర‌కు నిద్ర‌పోయేవారు కారు.. అన్న‌ట్టుగా పేరు తెచ్చుకున్నారు.

ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయేవారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ శతృవులు మ‌చ్చుకు కూడా క‌నిపించ‌రు. ఆఖ‌రుకు ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు కూడా విమ‌ర్శించే ప‌రిస్థితి లేకుండా చేసుకున్నారు.

అందుకే ఆయ‌న అచిర కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. గ‌తంలో త‌న తండ్రి రాజ‌మోహ‌న్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్న‌ప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ దాఖ‌లాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో అంద‌రినీ క‌లుపుకొని పోయే మేక‌పాటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు.

ఇంగ్లీష్‌, హిందీ స‌హా నాలుగు ప్రాంతీయ భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డంతోపాటు..పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌న నిత్యం కృషి చేసేవారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన వారిలో గౌతంరెడ్డి కూడా ఒక‌రు.

అయితే.. ఆయ‌న ఎప్పుడూ ఆడంబ‌రాలకు.. మీడియాలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌రు. త‌ను ఏం చేసినా.. సైలెంట్‌గా చేస్తారు. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు తెచ్చుకున్న గౌతంరెడ్డి.. రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయ‌న ఎవ‌రితోనూ కీచులా డింది లేదు. ఎవ‌రినీ బెదిరించింది కూడా లేదు. పార్టీకోసం.. ప్ర‌జ‌ల కోసం.. ఆయ‌న రాజ‌కీయాలు చేశారు. అంద‌రినీ క‌లుపుకొని పోయారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రిచేవారు. కాగా 1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచిఎమ్మెస్సీ పూర్తి చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఆయ‌న వైసీపీలో చేరారు. తాను చేస్తున్న ప‌నిద్వారానే త‌న‌కు గుర్తింపు ల‌భించాలని త‌పించారు. అంతేత‌ప్ప‌.. మాట‌ల ద్వారా.. గుర్తింపును కోరుకోలేదు.