Begin typing your search above and press return to search.

ఎంపీ జర్నలిస్ట్ కు కరోనా..క్వారంటైన్ కు మాజీ సీఎం కమల్ నాథ్

By:  Tupaki Desk   |   25 March 2020 2:17 PM GMT
ఎంపీ జర్నలిస్ట్ కు కరోనా..క్వారంటైన్ కు మాజీ సీఎం కమల్ నాథ్
X
మధ్యప్రదేశ్ లో రాజకీయ కలకలం ముగిసిన నాడే కరోనా వైరస్ కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన యువ నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి హ్యాండిచ్చేసి బీజేపీలోకి చేరిన నేపథ్యంలో అప్పటిదాకా సీఎంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన చేసేందుకు ఈ నెల 20న మీడియా సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రతినిధులతో కిక్కిరిసిపోయిన ఈ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్టుకు ఆ తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆయన కూతురుకు కూడా పాజిటివ్ అని తేలింది. వెరసి సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్ నాథ్ ఏకంగా క్వారంటైన్ కు వెళ్లక తప్పలేదు.

కమల్ నాథ్ క్వారంటైన్ తోనే ఈ ఎపిసోడ్ ముగియలేదు. ఎందుకంటే.. మీడియా సమావేశం ముగిసిన తర్వాత నేరుగా రాజ్ భవన్ వెళ్లిన కమల్ నాథ్... గవర్నర్ లాల్జీ టాండన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కమల్ తో టాండన్ అతి సమీపంగా కదిలారు. కమల్ ఇచ్చిన రాజీనామా పత్రాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ జర్నలిస్టు ద్వారా కమల్ కు... కమల్ నుంచి టాండన్ కు కూడా కరోనా సోకిందా? అన్న అనుమానాలతో ఇటు కమల్ ఇంట.. అటు రాజ్ భవన్ లోనూ కరోనా కలకలం రేగింది. అంతేకాకుండా మీడియా మీట్ లో కరోనా పాజిటివ్ జర్నలిస్ట్ తో చాలా మంది జర్నలిస్టులు - పలువురు కీలక నేతలు కూడా సన్నిహితంగానే మెలిగారు. దీంతో ఎలాటూ కమల్ క్వారంటైన్ కు వెళ్లడం - టాండన్ కరోనా నిర్ధారణ పరీక్షలకు సిద్ధపడటంతో ఇప్పుడు మీడియా మీట్ లో పాలుపంచుకున్న జర్నలిస్టులు - కీలక నేతలకు కూడా వైద్య పరీక్షలు తప్పనిసరిగా మారాయి.

మొత్తంగా సీఎం పదవికి రాజీనామా చేస్తూ కమల్ నిర్వహించిన మీడియా మీట్ కమల్ నాథ్ ను క్వారంటైన్ కు పంపగా... రాజీనామా చేసిన తర్వాత కూడా కాస్తంత రిలీఫ్ గా గడిపేందుకు అవకాశం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... కరోనా పాజిటివ్ జర్నలిస్టు కూతురుకు కూడా పాజిటివ్ అని తేలడంతో సదరు జర్నలిస్టు నుంచి ఇంకెంత మందికి ఈ వైరస్ సోకిందన్న విషయం ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోందనే చెప్పాలి. రాజకీయంగా పెను ప్రకంపనలు ముగిశాయనుకున్న నేపథ్యంలో ఈ కరోనా కలకలంతో ఆ రాష్ట్రంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.