Begin typing your search above and press return to search.

గులాబీ గూటిలో క‌ల‌క‌లం... ఆందోళ‌న‌లో టీఆర్ ఎస్‌

By:  Tupaki Desk   |   19 Aug 2019 9:33 AM GMT
గులాబీ గూటిలో క‌ల‌క‌లం... ఆందోళ‌న‌లో టీఆర్ ఎస్‌
X
గులాబీ గూటిలో క‌మ‌ల‌ద‌ళం క‌ల‌క‌లం రేపుతోందా..? అంటే బీజేపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మేన‌ని చెబుతున్నాయి. తెలంగాణ‌లో అంద‌రి స‌హ‌కారంతో 2023లో అధికారంలోకి వ‌స్తాం. తెలంగాణ రూపురేఖ‌లు మారుస్తాం.. ఇప్ప‌టికే 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 2023నాటికి 25 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటాం. అందులో తెలంగాణ కూడా ఉంటుంది అని జేపీ న‌డ్డా అన్నారు. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా టీఆర్ ఎస్ పార్టీని, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను టార్గెట్ చేసి న‌డ్డా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత క‌మ‌ల‌ద‌ళం అదే స్పీడ్‌ తో తెలంగాణ‌లో దూసుకెళ్తోంది. ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను లాగేసుకుంటూ త‌న బ‌లాన్ని పెంచుకుంటోంది. నిజానికి.. ఈ ప‌రిణామాలు గులాబీ గూటిలో కంటికి కునుకులేకుండా చేస్తోంది. బీజేపీలోకి వెళ్లేది కేవ‌లం కాంగ్రెస్ , టీడీపీ నేత‌లేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. మాజీ ఎంపీ జీ వివేక్ టీఆర్ ఎస్‌ కు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇదే దారిలో మ‌రికొంద‌రు నేత‌లు కూడా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంటే.. కాంగ్రెస్‌- టీడీపీలేకాదు.. అధికార టీఆర్ ఎస్ నుంచి కూడా ప‌లువురు కీల‌క నేత‌ల‌ను, అసంతృప్తి ఉన్న వారిని లాగే ప‌నిలో నిమ‌గ్న‌మైంది క‌మ‌ల‌ద‌ళం.

హైద‌రాబాద్‌ లో నిన్న ఎంపీ గ‌రిక‌పాటి మోహ‌న్‌ రావు, ఖ‌మ్మం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బ‌య్య‌, ఆ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు చిన్నితోపాటు పెద్ద‌సంఖ్య‌లో న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు. ఇలా రోజురోజుకూ బీజేపీ తెలంగాణ‌లో త‌న బ‌లాన్ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇక ఇదే స‌మ‌యంలో బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఎలా అడ్డుకుంటుందో సూటిగా చెబుతున్నారు. నిన్న న‌డ్డా ఇవే అంశాల‌ను ఆధారంగా చేసుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని తెలంగాణ‌లో అమ‌లు చేయ‌డంలేద‌ని, ఈ ప‌థ‌కం కింద తెలంగాణ‌లోని 24ల‌క్ష‌ల మంది అర్హులు కేసీఆర్‌ కు అక్క‌ర‌లేద‌ని, కేవ‌లం మోడీకి పేరు వ‌స్తుంద‌న్న అక్క‌సుతోనే అడ్డుకుంటున్నార‌ని న‌డ్డా మండిప‌డ్డారు. వాస్తు స‌రిగా లేద‌ని సెక్రెటేరియ‌ట్ భ‌వ‌నాన్ని కూల్చుతారా.. అని నిల‌దీశారు. 2023లో వాస్తు స‌రి అవుతుంద‌ని, అప్పుడు కేసీఆర్‌ కు వాస్తు అంటే ఏమిటో తెలుస్తుంద‌ని న‌డ్డా ఘాటుగా స్పందించారు. అయితే.. ఇన్ని రోజులూ తెలంగాణ వాదంతో నెట్టుకొచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు బీజేపీని ఎదుర్కొన‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకున్న బీజేపీ చాప‌కింద నీరులా వేగంగా విస్త‌రిస్తోంది. దాదాపుగా తెలంగాణ‌లోని అన్ని జిల్లాలో ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి లాగేసుకుంది. ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉండ‌డంతో.. ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. నిజానికి.. చెప్పాలంటే.. జాతీయ‌వాదంతో ముందుకొస్తున్న బీజేపీని ఎదుర్కొని నిల‌బ‌డానికి కేసీఆర్ వ‌ద్ద ఇప్ప‌టికిప్పుడు స‌రైన వ్యూహం అయితే లేద‌నే చెప్పొచ్చు.