Begin typing your search above and press return to search.

జేపీ నడ్డా జనసేనకు ఇలా షాకిచ్చారేంటి?

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:13 AM GMT
జేపీ నడ్డా జనసేనకు ఇలా షాకిచ్చారేంటి?
X
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన - బీజేపీ కూటమి తరఫున పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసేన వర్గాలు పెట్టుకున్న ఆశలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నీళ్లు చిమ్మారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా జనసేన పార్టీ గురించి అస్సలు ప్రస్తావన తేకపోవడం ఆ పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాము చూస్తున్నామని.. రోడ్ మ్యాప్ ఇవ్వగానే దాని ప్రకారం ముందుకెళ్తామని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ తన ముందు పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి.. జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాలోనూ జనసేన- బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందుకోసమే జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారని.. ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని మీడియా పేర్కొంది. అయితే మీడియా, జనసేన పార్టీ వర్గాలు ఆశించినట్టు జేపీ నడ్డా పొత్తుల గురించి కానీ, పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపైన కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

పైగా జేపీ నడ్డా పొత్తుల గురించి పక్కనపెట్టి బీజేపీ సొంతంగా ఏపీలో అధికారంలో వచ్చేలా పార్టీని బలోపేతం చేయాలని తమ పార్టీ శ్రేణులను కోరడం విశేషం. శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు తమ పరిధిలోని బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించి, కొత్త కార్యకర్తలను చేర్చుకుంటూ కమిటీలు వేయాలని నడ్డా ఆదేశించారు. కమిటీల్లో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఇలా అన్నివర్గాల వారికి స్థానం కల్పించాలన్నారు. వీరు ప్రతిరోజూ ఐదుగుర్ని కలిసి బీజేపీ సిద్ధాంతాలను వివరించాలని.. వీలైతే ఆ ఐదుగురిని పార్టీలో చేర్పించాలని చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉందని.. ఇప్పుడు సరైన సమయం కాదని ఆయన తేల్చిచెప్పడం విశేషం.

ప్రత్యర్థి పార్టీల మైండ్ గేమ్ లో బీజేపీ నేతలు పడొద్దని జేపీ నడ్డా సూచించడం గమనార్హం. ఈ మేరకు రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన నడ్డా విజయవాడలో రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న పొత్తులపై ఎలాంటి అంశాలను చర్చకు తీసుకొచ్చినప్పటికీ.. వాటిపై ఆలోచించకుండా సొంతంగా బలపడటంపై బీజేపీ నేతలంతా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పోలింగ్ బూత్ ల నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు చాలామంది ఏపీ పర్యటనకు వస్తారని నడ్డా బీజేపీ నేతలకు వివరించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారని.. ఆ సమయంలో ర్యాలీ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

బీజేపీ దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలతోనే పోరాడుతోందని నడ్డా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ రెండూ కుటుంబ పార్టీలేనని నడ్డా చెప్పడం గమనార్హం. మరోవైపు నడ్డా.. పవన్ కల్యాణ్ ను జనసేన -బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్రం నుంచి వెళ్లాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే రెండు పార్టీలు కలసికట్టుగా సాగడం కుదురుతుందని స్పష్టం చేస్తున్నారు. లేదంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెబుతున్నారు.