Begin typing your search above and press return to search.

బీజేపీకి షాక్ ట్రీట్ మెంట్.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   26 Dec 2018 5:46 AM GMT
బీజేపీకి షాక్ ట్రీట్ మెంట్.. ఏం జరుగుతోంది?
X
తెలంగాణ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత రాష్ట్ర బీజేపీ శాఖ ఇటీవలే ఓటమిపై పున సమీక్ష చేసుకుంది. అవమానకరమైన ఈ ఓటమికి ఏ ఒక్కరిని బాధ్యడిని చేయరాదని.. పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడడానికి కారణాలు అన్వేషించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరూ కూడా ఈ ఓటమికి బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మొదట కేంద్రం వైఖరి వల్లేనని అనుకున్నా తర్వాత నేతల పొరపాట్లు.. క్షేత్రస్థాయిలో బలం సహా ఓటమికి చాలా కారణాలను నేతలు అన్వయించుకున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూస్తున్న జేపీ నడ్డా నివేదిక రూపొందించారట.. నాయకులతో సమీక్ష అనంతరం ‘కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర బీజేపీకి అవసరమైన సాయం అందించామని.. జాతీయ నేతలు - ముఖ్యమంత్రులు కూడా వచ్చి ప్రచారం చేశారని.. కానీ రాష్ట్ర బీజేపీ నేతల చెత్త పనితీరు వల్లే తెలంగాణలో ఓడిపోయామని’ నడ్డా నివేదిక రూపొందించారట.. తెలంగాణలో ప్రస్తుత నాయకత్వం - సీనియర్లను మార్చాల్సిన అవసరం ఉందంటూ అమిత్ షాకు నడ్డా నివేదిక సిద్దం చేసి అందించబోతున్నాడని సమాచారం.

తెలంగాణ బీజేపీలో కష్టపడి ఈ ఎన్నికల్లో సత్తా చూపించిన సంకినేని - బండి సంజయ్ - ఆచారి లాంటి వాళ్లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నుంచి డిమాండ్ వ్యక్తమైందట.. స్వామి పరిపూర్ణానంద ప్రయోగం తెలంగాణలో పూర్తిగా విఫలమైన దృష్ట్యా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసి ముందుకెళ్లాలని నిర్ణయించారట..

కానీ ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారీ మార్పులు చేస్తే తెలంగాణ బీజేపీలో అసమ్మతి - అసంతృప్తి రాజేసి కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో ఇప్పటికిప్పుడు పార్టీని ప్రక్షాళన చేయడానికి బీజేపీ సాహసించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ సడన్ షాక్ లతో పార్టీకే నష్టమని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 2 సీట్లు అయినా గెలుచుకోవాలన్న బీజేపీ పంతం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి మరి..