Begin typing your search above and press return to search.

బాబు తర్వాత టీడీపీని నడిపించే యువనేత ఇతడేనా?

By:  Tupaki Desk   |   20 Nov 2019 11:37 AM GMT
బాబు తర్వాత టీడీపీని నడిపించే యువనేత ఇతడేనా?
X
2024.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరం.. 2019లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబుపై, ఆయన భావి వారసుడు లోకేష్ పై పార్టీ నేతల్లో నమ్మకం సడులుతోంది. 2024 వరకు చంద్రబాబు వయసు 75 ఏళ్లు అవుతోంది. వయోభారం కూడా వేధిస్తోంది. పోనీ ఇప్పుడు పనిచేసినా మరి భావి టీడీపీ నేత ఎవరు? చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పార్టీని నడిపించే ఆ యువనేత ఎవరనే ప్రశ్న ఇప్పుడు టీడీపీ శ్రేణులను వేధిస్తోంది.

చంద్రబాబు మరో పదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండొచ్చు. అయితే ఆయన గట్టి ప్రత్యర్థి అయిన యువకుడైన వైఎస్ జగన్ తో చంద్రబాబు పోటీపడే అవకాశాలు లేవు.. ఇక బాబు పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు టీడీపీకి జవసత్వాలు నింపేందుకు నందమూరి వారసుడు - హీరో జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ శ్రేణులు - అసమ్మతి వాదులు ముక్తకంఠంతో వాదిస్తున్నారు.

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ సైతం లోకేష్ లాంటి అసమర్థుడిని కాపాడడానికి జూ. ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టాడని ఘాటు విమర్శలు చేశారు. ఇక కొడాలి నాని సైతం లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బలిచేశారని.. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించాడు. లోకేష్ నాయకత్వం టీడీపీని పాతిపెడుతుందని ధ్వజమెత్తారు.

ఇలా ఇంటా బయటా లోకేష్ బాబు టీడీపీ భావి వారసుడు కాదని.. జూ. ఎన్టీఆరే రావాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తర్వాత లోకేష్ తో పార్టీ ముందుకు నడవదని.. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఒక వర్గం భావిస్తోంది. జూనియర్ వస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతోంది. మొత్తానికి చంద్రబాబు తర్వాత పార్టీని నడిపే యువ నేత ఎవరు అనే చర్చ ఇప్పుడు టీడీపీలో కింది స్థాయి నుంచి పై వరకు నడుస్తోంది.

అయితే టీడీపీ నేతలు కోరినా.. చంద్రబాబు - లోకేష్ లు తప్పుకున్నా ఇప్పుడైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి లేరు. సినిమా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఎన్టీఆర్ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు వదిలి టీడీపీ కోసం ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ వచ్చే పరిస్థితుల్లో అయితే లేరు.. మరి భవిష్యత్తులోనైనా చంద్రబాబు తప్పుకున్నాకైనా ఎన్టీఆర్ వస్తాడా రారా అన్నది కాలమే నిర్ణయించాలి.