Begin typing your search above and press return to search.

రాజకీయ కష్టంలో జూనియర్‌ ఎన్టీఆర్‌..!

By:  Tupaki Desk   |   10 March 2019 4:41 AM GMT
రాజకీయ కష్టంలో జూనియర్‌ ఎన్టీఆర్‌..!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. జూనియర్‌ అక్క సుహాసిని కోసం కూకట్ పల్లిలో ప్రచారం చేస్తాడని కొందరు.. మరోచోట పోటీచేస్తాడని మరికొందరు భావించారు. కానీ ఎన్టీఆర్ ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు.. ప్రచారమూ చేయలేదు.. అయినా ఆయన గురించి రకరకాలుగా రాజకీయంగా చర్చ జోరుగా సాగింది. కానీ ఆయన ఎటువంటి యాక్షన్‌ ఎపిసోడ్‌ లో పాల్గొనలేదు.

తాజాగా సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో మళ్లీ జూనియర్‌ పేరు మారుమోగుతోంది. అయితే అప్పుడు తెలంగాణ వేదిక కాగా.. ఇప్పుడు నవ్యాంధ్రలో జూనియర్‌ ప్రచారం చేస్తాడని అనుకుంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీకి జై కొట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఈయన పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

చిలకలూరిపేటకు టీడీపీ నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ ఆయన మూడుసార్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే వైపీసీ ఆ సామాజిక వర్గం నేతను బరిలోకి దించే ప్రయత్నం చేస్తోందట. ఇందులో భాగంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావును పోటీకి దించాలని జగన్‌ ఆలోచిస్తున్నాడట. అయితే నార్నె శ్రీనివాసరావు కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తాడా..? అనే చర్చ రాజకీయంగా జోరుగా సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మాస్‌ ఇమేజ్‌ ఉన్న సినీ హీరోల్లో జూనియర్‌ ఒకరు. ఎన్నికల ప్రచారం ఎన్టీఆర్‌ కు కొత్తేమీ కాదు. 2009లో టీడీపీ కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ తరువాత చంద్రబాబుకు - హరికృష్ణకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ కారణంగా జూనియర్‌ కూడా టీడీపీకి దూరంగానే ఉంటూ వచ్చారు. దీంతో కూకట్‌ పల్లి నియోజకవర్గంలో సుహాసిని కోసం నందమూరి ఫ్యామిలీ అంతా ముందుకు వచ్చింది గానీ.. జూనియర్‌ మాత్రం ప్రచారానికి రాలేదు. ఇప్పుడు మామ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తారా..? లేదా అన్నది ఆసక్తిగా మారింది.

అయితే నార్నె శ్రీనివాసరావు ఉన్నది వైసీపీలో. సరిగ్గా ఇక్కడే కొత్త చర్చ ప్రారంభమైంది. కూకట్‌ పల్లి విషయంలో సుహాసిని విజయాన్నికాంక్షిస్తూ ప్రెస్‌ నోట్‌ ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇప్పుడు మామ కోసం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసినా.. ప్రచారం చేసినా.. టీడీపీని ఓడించాలనే చేయాలి.. తాత ఎన్టీఆర్ స్థాపించిన వీరి సొంత పార్టీగా భావిస్తున్న టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ అస్సలు చేయలేడనే చర్చ సాగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.