Begin typing your search above and press return to search.

‘రాజీనామా’ చేసి.. బెజవాడ విధుల్లో జడ్జి

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:20 AM GMT
‘రాజీనామా’ చేసి.. బెజవాడ విధుల్లో జడ్జి
X
హైకోర్టు విభజన.. జడ్జిల ఆప్షన్లకు సంబంధించి ఆదివారం 120మంది తెలంగాణ జడ్జిలు హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేయటం తెలిసందే. తమ డిమాండ్ల సాధనలో భాగంగా మూకుమ్మడి రాజీనామాలకు సైతం తాము సిద్ధమేనని తేల్చి చెప్పిన వారు గవర్నర్ కు వినతిపత్రం అందించారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి నిరసన జరిగిందని చెబుతున్న జడ్జిల నిరసనపై హైకోర్టు కొరడా విదల్చటం లాంటివి చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని.. మూకుమ్మడి రాజీనామాలకు తాను సైతం సిద్ధమేనని చెప్పిన తెలంగాణ క్యాడర్ కు చెందిన జడ్జికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. విజయవాడలోని సిటీ సివిల్ కోర్టులో 14వ అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జస్టిస్ కె.శ్రీకాంతాచారి టీ జడ్జెస్ అసోసియేషన్ కు తన రాజీనామాను సమర్పించారు.

ఆదివారం మూకుమ్మడి రాజీనామాలకు రెఢీ అని చెప్పి.. అసోసియేషన్ కు రాజీనామా లేఖను అందించిన ఆయన సోమవారం యథావిధిగా బెజవాడకు వచ్చి తన విధులకు హాజరయ్యారు. దీనిపై బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన కొందరు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ మన్మధరావు ఆధ్వర్యంలోని బృందం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్. నిరంజన్ ను కలిసి విషయాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన.. జస్టిస్ శ్రీకాంతాచారిని పిలిపించి మాట్లాడినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీకాంతాచారి సెలవు మీద వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయినా.. పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పి.. విధులకు హాజరుకావటం ఏమిటో..?