Begin typing your search above and press return to search.

వరంగల్ కోర్టులో అంత గలాటా జరిగిందా?

By:  Tupaki Desk   |   28 Jun 2016 4:41 PM GMT
వరంగల్ కోర్టులో అంత గలాటా జరిగిందా?
X
హైకోర్టు విభజన.. జడ్జిల నియామకంలో నెలకొన్న అంశాలపై తెలంగాణ జడ్జిలు చేపట్టిన నిరసన వ్యవహారం మంగళవారం పలు మలుపులు తిరిగింది. జడ్జిల నియామకం విషయంలో తెలంగాణ జడ్జిల సంఘం నిరసన వ్యక్తం చేయటం.. ఆదివారం 120 జడ్జిలతో నిరసన ర్యాలీ నిర్వహించటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడు.. కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మంగళవారం హైకోర్టు నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

పలు చోట్ల న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగిలిన చోట్లకు భిన్నంగా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కోర్టులో మంగళవారం తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. విధులను బహిష్కరించిన లాయర్లు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వారు.. ఒక్కసారిగా కోర్టు హాలులోకి చొచ్చుకెళ్లారు. అప్పటివరకూ నినాదాలకే పరిమితమైన లాయర్లు అక్కడున్న కుర్చీలు.. బల్లలు విసిరేశారు.

వారిని అడ్డుకునేందుకు అక్కడున్న పోలీసులు ప్రయత్నించటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. లాయర్లు అదుపు చేసేందుకు పోలీసులు.. వారిని అధిగమించి తమ నిరసనను తెలిపే ప్రయత్నంలో న్యాయవాదులు తీవ్రప్రయత్నం చేయటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అతి కష్టమ్మీద న్యాయవాదుల్ని కంట్రోల్ చేసిన పోలీసులు.. వారిని కోర్టు హాలు నుంచి బయటకు పంపారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత.. కోర్టు హాలు మొత్తం పడిపోయిన బెంచీలు.. కుర్చీలతో చిందరవందరగా మారింది. మరోవైపు బయటకు వచ్చిన న్యాయవాదులు ఆంధ్రా న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత హడావుడి జరగటంతోనే.. కోర్టు హాలులో గందరగోళం చేసిన ఎనిమిది లాయర్లను గుర్తించి వారినై కేసులు నమోదు చేశారు.