Begin typing your search above and press return to search.

జూడో చాంపియన్ పుతిన్ కు జూడో సమాఖ్య షాక్

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:30 PM GMT
జూడో చాంపియన్ పుతిన్ కు జూడో సమాఖ్య షాక్
X
ప్రస్తుతం వార్తల్లోని వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ పై దాడితో రష్యా మీద అమెరికా, నాటో ఆర్థిక ఆంక్షలు, పుతిన్ వ్యక్తిగత ఆస్తుల స్తంభన తదితర చర్యలు తీసుకుంటోంది. ఇంతలో ఊహించని విధంగా రష్యా అధ్యక్షుడికి షాకిచ్చింది ప్రపంచ జూడో సమాఖ్య. పుతిన్ జూడోలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తన్న సంగతి తెలిసిందే.

సెయింట్ పీటర్స్ బర్గ్ లో అతడి బాల్యాన్ని మలుపుతిప్పిందే జూడో. 60 ఏళ్ల కిందటి అక్కడి పేదరికం.. స్థానిక దౌర్జన్య ముఠాలను ఎదుర్కొనడంలో యుద్ధ విద్య జూడో పుతిన్ కు ఎంతో ధైర్యాన్నిచ్చింది. అక్కడినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోనంతగా ఎదిగిపోయారు. తొలుత రష్యన్ గూఢచార సంస్థ కేజీబీలో చేరి.. వివిధ దేశాల్లో బాధ్యతలు నిర్వర్తించి.. ఆపై స్వదేశం చేరి.. సొంత నగరం ఉప మేయర్ గా ఎన్నికై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికీ 40 ఏళ్ల వాడిలా కనిపిస్తారు. కండలు తిరిగిన దేహంతో ఉంటారు.

ఈ ఫిట్ నెస్ కు ఒక విధంగా జూడోనే కారణం అని చెప్పవచ్చు. అన్నిటికి మించి పుతిన్ ఈ స్థాయిలో ఉండడానికి బీజం వేసింది జూడోనే. ఈ మార్సల్ ఆర్ట్స్ ఇచ్చిన మానసిక స్థైర్యంతోనే పుతిన్ ఇప్పుడు ఎంతటి సవాలునైనా ఎదుర్కొనే స్థాయికి చేరారు. 2014లో క్రిమియాను ఆక్రమించినా.. ఎనిమిదేళ్లలో పుతిన్ ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పడూ అదే దమ్ముతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నారు. కాగా, పుతిన్ జీవితంలో ఇంతగా ప్రాధాన్యత ఉన్న జూడోలో ఇప్పుడు ఆయనకు షాక్ తగిలింది. పుతిన్‌కు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ షాకిచ్చింది.

జూడో సమాఖ్య గౌరవాధ్యక్ష, ఇంటర్నేషనల్‌ జూడో ఫెడరేషన్‌ అంబాసిడర్‌ పదవుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజేఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. టోర్నీల రద్దుతో రష్యాపై క్రీడా యుద్ధం ఉక్రెయిన్ ఆక్రమణ నేపథ్యంలో రష్యాలో టోర్నీలు రద్దు చేసుకుంటున్న క్రీడా సమాఖ్యలు. రష్యాను క్రీడా సమాఖ్యలు దెబ్బ కొడుతున్నాయి.

ఆ దేశంలో టోర్నీలు నిర్వహించేందుకు, మ్యాచ్‌లు ఆడేందుకు విముఖత చూపుతున్నాయి. పోటీలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై అన్ని రంగాల్లో ఆంక్షలు విధించేందుకు ఐరోపా యూనియన్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ తదితర దేశాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు క్రీడల్లోనూ ఆ దేశానికి ఎదురుదెబ్బ తప్పడం లేదు. డోపింగ్‌ వివాదం కారణంగా కొంతకాలం అంతర్జాతీయ పోటీలకు దూరమైన ఆ దేశం.. ఇప్పటికీ రష్యా ఒలింపిక్‌ కమిటీ పేరుతోనే టోర్నీల్లో పాల్గొంటోంది.

ఇప్పుడిక యుద్ధం నేపథ్యంలో సుమారు మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు క్రీడల పరంగా ఆ దేశంపై పెను ప్రభావం పడేలా కనిపిస్తోంది. రష్యాతో పాటు బెలారస్‌లోనూ నిర్వహించాల్సి ఉన్న క్రీడా టోర్నీలను రద్దు చేసుకోవాలని లేదా ఇతర దేశాలకు తరలించాలని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) కోరింది. అంతే కాకుండా ఆ దేశాల జెండాలను వాడకూడదని, జాతీయ గీతాలను వినిపించకూడదని సూచించింది. ఇప్పటికే రష్యాలో జరగాల్సిన ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ను ప్యారిస్‌కు తరలించాలని యూఈఎఫ్‌ఏ నిర్ణయించింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడ జరగాల్సిన ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రి రేసును నిర్వహించడం అసాధ్యమని ఏఫ్‌ఐఏ స్పష్టం చేసింది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ ఆ దేశంతో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడబోమని శనివారం పోలండ్‌ ప్రకటించింది. వచ్చే నెల 24న రష్యాలో ఈ మ్యాచ్‌ జరగాల్సింది. ''ఇక మాటల్లేవ్‌. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది'' అని పోలండ్‌ సాకర్‌ సమాఖ్య అధ్యక్షుడు సెజరీ ట్వీట్‌ చేశాడు.

ఆ దేశ స్టార్‌ ఆటగాడు రాబర్ట్‌ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించాడు. మరోవైపు ఐఓసీ పిలుపు మేరకు ఈ ఏడాది రష్యాలో జరగాల్సిన వాలీబాల్‌, షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు కూడా ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో చెస్ ఒలింపియాడ్
భారత్ లాగానే చెస్ లో రష్యాది అద్వితీయ ప్రస్థానం. అక్కడినుంచి ఎందరో చాంపియన్లు వచ్చారు. ఈఏడాది రష్యాలో చెస్ ఒలింపియాడ్ జరగాల్సి ఉంది. అయితే, రష్యా నుంచి తరలిన చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ప్రయత్నాలు మొదలెట్టింది.

ఈ ఏడాది జరిగే ఆ టోర్నీ ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ దాఖలు చేస్తామని అఖిల భారత్‌ చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) శనివారం ప్రకటించింది. రెండు వారాల పాటు సాగే ఈ ఒలింపియాడ్‌లో దాదాపు 190 దేశాలు పోటీపడతాయి. షెడ్యూల్‌ ప్రకారం మాస్కోలో జులై 26 నుంచి ఆగస్టు 8 వరకు టోర్నీ జరగాల్సింది.

కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో దీన్ని అక్కడ నిర్వహించడం లేదు. ''ఈ ఏడాది చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ వేయబోతున్నాం. ఆ టోర్నీ బడ్జెట్‌ సుమారు రూ.75 కోట్లు ఉంటుంది'' అని ఏఐసీఎఫ్‌ కార్యదర్శి భరత్‌ సింగ్‌ వెల్లడించాడు. ఈ ఒలింపియాడ్‌తో పాటు దివ్యాంగుల కోసం తొలిసారి నిర్వహించాలనుకున్న చెస్‌ ఒలింపియాడ్‌, మిగతా టోర్నీలను కూడా రష్యా నుంచి తరలిస్తున్నట్లు ఫిడే ప్రకటించింది.

శాంతి.. శాంతి.. ఆటగాళ్ల మంత్రం ఇదే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంటే ఆ దేశ ఆటగాళ్లు మాత్రం శాంతి కోరుకుంటున్నారు. తాను యుద్ధాన్ని కాదు శాంతిని ప్రోత్సహిస్తానని టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు అందుకోనున్న మెద్వెదెవ్‌ చెప్పాడు. మరోవైపు దుబాయ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌ చేరిన తర్వాత మరో రష్యా ఆటగాడు రుబ్లెవ్‌ కూడా ''దయచేసి యుద్ధం వద్దు'' అని పేర్కొన్నాడు.

ఉక్రెయిన్‌కు చెందిన మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ విటాలి తన బాక్సింగ్‌ సోదరుడు వ్లాదిమిర్‌తో కలిసి యుద్ధంలో పోరాడుతానని తెలిపాడు. మరోవైపు ఫుట్‌బాల్‌ క్లబ్‌ చెల్సీ యజమాని రోమన్‌ అబ్రమోవిచ్‌ ఆస్తులు జప్తు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని బ్రిటన్‌ మంత్రి క్రిస్‌ బ్రయాంట్‌ కోరారు.