Begin typing your search above and press return to search.

పోయినోళ్లు మిగిలినోళ్లను లాగేస్తున్నారట.. టీడీపీకి కష్టమే

By:  Tupaki Desk   |   14 March 2020 3:30 AM GMT
పోయినోళ్లు మిగిలినోళ్లను లాగేస్తున్నారట.. టీడీపీకి కష్టమే
X
ఏపీలో విపక్షంగా మారిపోయిన తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీని వీడి వైసీపీ దరికి చేరిపోయారు. టీడీపీకి చేయిచ్చిన వాళ్లు... అంతటి తో ఆగిపోవడం లేదంట. టీడీపీలో ఇంకా కొనసాగుతున్న నేతలను వైసీపీలోకి లాగేసే యత్నాలను ముమ్మరం చేశారట. ఈ తరహా యత్నాలు ప్రస్తుతం జోరందుకోగా... ఆ యత్నాలు ఫలిస్తున్న సూచనలు కూడా ఓ రేంజిలో పెరిగిపోయిన వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన నేతల తీరుతో షాక్ తిన్న చంద్రబాబు... ఆ నేతలు ఇప్పుడు నెరపుతున్న మంత్రాంగం తో మరిన్ని షాకులను చవిచూడక తప్పదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇలా తామేదో పార్టీని వీడి సైలెంట్ అయిపోవడానికి బదులుగా.. తమ తో సన్నిహితంగా మెలగిన నేతలను కూడా టీడీపీ నుంచి బయటకు లాగేసే యత్నాలు చేస్తున్న నేతలు తమతమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారట. ఇందుకు నిదర్శనంగా ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంటున్న మార్పులే కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీకి షాకివ్వగా... తాజాగా కదిరి బాబురావు, కరణం బలరామకృష్ణమూర్తి భారీ షాకే ఇచ్చారు. గురువారం జగన్ తో భేటీ అయిన కరణం... తనకు అత్యంత సన్నిహితంగా మెలగిన ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారట. టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలోనే తాను ఆ పార్టీని వీడానని, మీరు కూడా వైసీపీలోకి వచ్చేస్తే బాగుటుందని కూడా కరణం చెబుతున్నారట. ఈ మాటకు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఒకింత సానుకూలంగానే స్పందించినట్టుగా సమాచారం.

కరణం మాటతో శిద్ధా ఆలోచనలో పడగానే... శిద్ధా కూడా జంపేనంటూ వినిపించిన వార్తలు పెనున కలకలమే రేపాయి. టీడీపీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో శిద్ధా కీలక నేత కిందే లెక్క. పార్టీకి ఏ అవసరం వచ్చినా ఆదుకునే నేతగా శిద్ధాకు పేరుంది. అలాంటి నేత కూడా కరణం పిలుపుతో ఆలోచనలో పడిపోయారంటే సంచలనమే కదా. ఇదిలా ఉంటే... ఇదే తరహా యత్నాలు కడప జిల్లాలోనూ జోరందుకున్నాయట. ఇటీవలే టీడీపీకి హ్యాండిచ్చేసి వైసీపీలో చేరిపోయిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ..కడప జిల్లాలో టీడీపీకీ కీలకమైన నేతగా మైనారిటీ నేత సుబాన్ బాషాతో టీడీపీకి రాజీనామా చేయించినట్లు సమాచారం. రామసుబ్బారెడ్డితోపాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెరవెనుక పాత్ర పోషించడం వల్లనే సుబాన్ బాషా టీడీపీని వీడినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆయన చంద్రబాబు, లోకేష్ తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించడం విశేషం. సుబాన్ బాషా తో పాటు ఆయన అనుచరులకు డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మొత్తంగా చూస్తుంటే... టీడీపీ ని వీడిన నేతలు అలా సైలెంట్ గా తమ పనిని తాము చూసుకోవడానికే పరిమితం కాకుండా టీడీపీ మిగిలిపోయిన నేతలను కూడా వైసీపీలోకి లాగేందుకు చేస్తున్న యత్నాలు నిజంగానే టీడీపీకి అశనిపాతంగా మారాయని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం... గురువారం జగన్ తో భేటీ కాగానే... అక్కడ పార్టీకి కొత్త ఇంచార్జీగా యడం బాలాజీని నియమిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే తరహాలో కడప జిల్లా జమ్మలమగుడులో రామసుబ్బారెడ్డి పార్టీని వీడిన వెంటనే ప్రత్యామ్నాయం చూసే ఛాన్సే చంద్రబాబుకు సాధ్యం కాలేదు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా పార్టీకి రాజీనామా చేసేశారు. అక్కడ కూడా టీడీపీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా టీడీపీని వీడుతున్న నేతలు... తమ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం ప్రత్యామ్నాయం కూడా లేకుండా చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.