Begin typing your search above and press return to search.

జంపింగ్‌ జపాంగ్‌ లకు బహిష్కరణ గుబులు

By:  Tupaki Desk   |   26 Nov 2018 8:36 AM GMT
జంపింగ్‌ జపాంగ్‌ లకు బహిష్కరణ గుబులు
X
తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత రాజుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ఒక వైపు బహిరంగ సభల్లో పార్టీ నేతల ప్రసంగాలు ఊపందుకోగా.. మరో వైపు రెబల్‌ స్టార్ల భయం మనసుల్లో గుబులు రేపుతోంది . శనివారం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 24 మందిపై ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు పడింది. వీరిలో పార్టీ రెబల్‌ గా నామినేషన్లు వేసిన వారు అధికంగా ఉన్నారు. మరి కొంత మందిని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే నెపంతో బయటకు తోసేశారు. వీరంతా ఎంతో కొంత ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వారే. కాంగ్రెస్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో కూటమికి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఐదేళ్లపాటు పార్టీ జెండాను గుండెలపై పెట్టుకుని మోసిన తమను ఇలా అర్థంతరంగా బహిష్కరించడం సమంజసం కాదని బహిష్కరణకు గురైన నేతలు మండిపడుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న నేతలనే రాజకీయ లబ్ధి కోసం బయటకు పంపడంతో .. ఆంధ్రప్రదేశ్‌ లో తమ పరిస్థితి ఏంటని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు.. ప్రలోభాలకు లొంగి స్వార్థపూరితంగా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వీరైతే తమ దారి.. ఇక గోదారేనని డీలా పడిపోతున్నారు. పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన మామ నందమూరి తారక రామారావునే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తమను కచ్చితంగా బయటకు నెట్టేస్తారేమోనని మధన పడుతున్నారు. అవకాశ వాద రాజకీయాల కోసం బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీతోనే జతకట్టిన బాబు.. సీటిచ్చి గెలిపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి వచ్చిన తమ రాజకీయ భవిష్యత్‌ ఇక అంధకారమేనని గగ్గోలు పెడుతున్నారు.

ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని అద్దంకి వంటి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ తెలుగుదేశం పార్టీ గోడ దూకారు. దీంతో అక్కడ ఏళ్ల తరబడి టీడీపీకి పట్టం కడుతున్న కరణం బలరామ్‌ ప్రాబల్యం తగ్గింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల నేతలకు అనేక సార్లు వివాదాలు చెలరేగాయి. ఇవి ఘర్షణలకూ దారి తీశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలకు తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్గీతో పొత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సీట్లను వదులుకోక తప్పదు. ఈ నేపథ్యంలో తమకూ బహిష్కరణ తప్పదనే భయం జంపింగ్‌ జపాంగ్‌ లను వెంటాడుతూనే ఉంది. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లలేక - ఇటు చంద్రబాబు మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక రెండింటికీ చెడ్డ రేవడిలా తమ రాజకీయ భవిష్యత్‌ మారుతుందని కుమిలిపోతున్నారు. మరో వైపు టీడీపీలోని కొందరు సీనియర్‌ నేతలు కూడా ఇదే విధంగా గుబులు చెందుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పొత్తును వ్యతిరేకిస్తున్న వీరంతా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆగ్రహానికి గురవుతామేమోనని ఆందోళన చెందుతున్నారు. విశ్వసనీయత గల నేతలను - కన్నతల్లిలా ఆదరించిన నేతలకు అన్యాయం చేస్తే ఎవరికైనా ఇలా గుణపాఠం తప్పదని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.