Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిదానం.. కారెక్కిన ఎమ్మెల్యేల మథనం..!

By:  Tupaki Desk   |   14 July 2019 2:30 PM GMT
కేసీఆర్ నిదానం.. కారెక్కిన ఎమ్మెల్యేల మథనం..!
X
కేటీఆర్ - హరీష్.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - సీఎం కేసీఆర్ కొడుకు, అల్లుడు.. పోయిన సారి ప్రభుత్వంలో కీరోల్ పోషించారు. ఇప్పుడు వారికే మంత్రి పదవులు లేవు. ఖాళీగా కూర్చున్నారు. ఇక జంపింగ్ ల పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.. తెలంగాణలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరి గంపెడాశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటూ కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ లో సీనియర్ నేతలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి - గండ్ర వెంకట రమణా రెడ్డి సహా 12మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. మంత్రి - నామినేటెడ్ - విప్ పదవులు సహా కార్పొరేషన్ పదవులపై వీరంతా హామీలు పొంది ఆశలు పెట్టుకొని టీఆర్ ఎస్ లో చేరారు. సబితాకు మహిళా కోటాలో మంత్రి పదవిని కేసీఆర్ ఆశచూపారన్న వార్తలు వచ్చాయి. ఆమె కొడుకు ఎంపీ పదవి ఇస్తానని ఇవ్వలేదన్న చర్చ సాగింది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్లారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడు ఆయన స్థానంలో సబితాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అన్న సందేహం ఆమెను వెంటాడుతోందట..

అలానే ఎస్టీ కోటాలో కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరూ లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కారెక్కిన ఆత్రం సక్కు - రేగా కాంతారావు - వీరయ్యలు ఇప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కందుల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావులు విప్ కానీ, నామినెటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన మంచి వాగ్ధాటి గల గండ్ర వెంకటరమణా రెడ్డి పార్టీ మారగానే తన భార్యకు జడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. టీఆర్ఎస్ లో చేరి కాసింత లాభపడ్డది ఈయనొక్కరే.

ఇక టీఆర్ ఎస్ లో చేరిన ఆ 12 మంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోని మార్కెట్ కమిటీ - సహకార సంఘాలు - ఇతర పదవులను తమ వాళ్లకే ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టాన వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ కేసీఆర్ ప్రస్తుతం వీటన్నింటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అంతా మౌనంగా ఉంటూ తన పని తాను కానిచ్చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మథనపడుతున్నారట..