Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అస‌లు విష‌యం మ‌ర్చిపోతున్నారా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:23 AM GMT
ప‌వ‌న్ అస‌లు విష‌యం మ‌ర్చిపోతున్నారా?
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ట్వీట్లు - రాజ‌కీయంగా ఆయ‌న వేస్తున్న అడుగుల నేప‌థ్యంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత ఇంతవరకు పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు జనసేనాధిపతి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్దంచేస్తారా లేక మరికొంత సమయం ఉంద‌టూ ఏదో ఒక పార్టీకి జై కొడతారా అన్నది ప్రస్తుతం ఆనోట ఈ నోట వినిపిస్తున్న మాటలు. ఈ ఊహాగానాలకు తెరదించడమన్నది పవన్‌ కళ్యాణ్‌ చేతుల్లోనే ఉందని రాజకీయ వర్గా లు పేర్కొంటున్నాయి. మరోవైపు జనసేన పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తే అటువైపు జంప్‌ అయ్యేందుకు గోడమీద పిల్లులు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెరపైకి ఇప్పటికిప్పుడు ఈ గోడమీద పిల్లులు కనిపించకపోయినా పవన్‌ కళ్యాణ్‌ పూర్తి స్పష్టత ఇస్తే జంపింగ్‌ లు అన్నీ పార్టీల నుంచి కూడా ఉండొచ్చని ప‌లువురు వ్యాఖ్యనిస్తున్నారు.

ప‌వ‌న్ జ‌న‌సేన ప‌య‌నాన్ని విశ్లేషించేముందు ఆయ‌న‌ రాజ‌కీయ అడుగులను సైతం కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. ప‌వ‌న్ సోద‌రుడు - మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నికలకు ముందు పీఆర్‌ పీ ఏర్పాటైనప్పుడు జిల్లా కమిటీలు - వివిధ స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటుచేసుకొని ఎన్నికల గోదాలోకి దిగింది. పీఆర్‌ పీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయనంతవరకు ఎన్నికలకు ముందు ఈ పార్టీలో పవన్‌ కళ్యాణ్‌ కూడా కీలక పాత్ర పోషించారు. పీఆర్‌ పీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. పార్టీ అంటే క్షేత్రస్థాయినుంచి క్యాడర్‌ ను నిర్మాణం చేసుకుంటూ పోవడమన్న విషయం పవన్‌ కళ్యాణ్‌ కు తెలుసు. అయినప్ప‌టికీ ఇంతవరకు పార్టీ క్షేత్రస్థాయిలో విస్తరింపజేసేందుకు ఆయన కనీసం ఎలాంటి కసరత్తు చేయకపోవడంపైనే రాజకీయ ఉద్దండులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికల గోదాలోకి పవన్‌ కళ్యాణ్‌ దించుతారా లేక కొన్ని సీట్లతో సరిపుచ్చుకొని ఏదో ఒక పార్టీతో జతకడతారా అన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ లను నియమించుకొని తద్వారా అభ్యర్థుల ఎంపికకు దిగుతుందని కొందరు రాజకీయ ఉద్దండులు పేర్కొంటున్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కనీసం తన రాజకీయ అజెండా ఎలా ఉంటుంది, పాత నాయకత్వాన్ని తన పార్టీలోకి తీసుకొంటారా లేక పూర్తిగా నవ, యువ నాయకత్వాన్ని తీసుకొంటారా అన్న అంశాలపై ఇంకా స్పష్టత ఇవ్వని విష యం తెలిసిందే.

ఒక‌వేళ సమ సమాజం నిర్మించే దిశగా పూర్తి స్థాయిలో కొత్త నాయకత్వం తీసుకొని రాజకీయాలు మార్చే దిశగా అజెండాను జనసేన పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీతో జతకట్టేందుకు వామపక్ష పార్టీలు సంసిద్దంగా ఉన్నాయని ప్ర‌క‌టించాయి. కానీ పవన్‌ కళ్యాణ్‌ వ్యవహార శైలీయే వామపక్షాలను సైతం కొంత సంశయానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ చేప‌ట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ తో ఆ పార్టీలోనూ అంతర్గతంగా గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు టీడీపీలో పోలేక వైసీపీలో పూర్తిస్థాయిలో ఉండలేక ఉన్న నేతలు ఉన్నారన్న వాదన ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా రాజకీయ భవిష్యత్తుపై ధీమాలోని నేతలు ఉన్నారన్న చర్చ కూడా ఉంది. ఈ తరుణంలో జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్‌ పై పవన్‌ కళ్యాణ్‌ పూర్తిస్థాయి స్పష్టత ఇస్తే ఆ పార్టీలోకి జంప్‌ అయ్యేందుకు కూడా కొందరు గోడమీది గోపిలు కాసుకొని కూర్చున్నట్లు సమాచారం. తెరపైకి వారు రాకపోయినా పవన్‌ కళ్యాణ్‌ స్పష్టత ఇస్తే మాత్రం గోడమీది గోపీలు బయటకు వస్తారన్న వాదన కూడా ఉంది. అయి తే పవన్‌ కళ్యాణ్‌ తనకు తాను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్నది కూడా చర్చాంశనీయంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/