Begin typing your search above and press return to search.

జూనియర్ దూరం... దూరం ?

By:  Tupaki Desk   |   22 Nov 2021 7:02 AM GMT
జూనియర్ దూరం... దూరం  ?
X
అచ్చం తాత పోలికలతో పాటు ఆయన నటనా ప్రతిభను కూడా పుణికి పుచ్చుకున్న నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీయార్. మూడవ తరంలో సూపర్ స్టార్ గా ఎదిరిన‌ తెలుగు సినీ సీమలో తనదైన టాప్ పొజిషన్ లో ఉన్నాడు. దీని వెనక జూనియర్ రెక్కల కష్టం ఎంతో ఉంది అనే చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీయార్ కేవలం హీరో మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా బుల్లి తెర మీద తన సత్తాను చాటుకున్నాడు. జూనియర్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ తో రీ సౌండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ మరిన్ని దశాబ్దాల పాటు కొనసాగేటంత పాపులారిటీని సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీయార్ రాజకీయంగా కూడా ఒకనాడు టీడీపీలో చురుకుగా ఉన్న సంగతి విధితమే.

మామ చంద్రబాబు పిలుపు మేరకు ఆయన 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఏపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సీట్లు 44 నుంచి తొంబై దాకా పెరిగాయి కానీ అధికారం మాత్రం దక్కలేదు. రెండవసారి వైఎస్సార్ సీఎం అయ్యాడు. అయితే జూనియర్ తిరిగిన చోటల్లా జనం బ్రహ్మరధం పట్టారు. అచ్చం తాత మాదిరిగానే హావభావాలతో ఆకట్టుకున్నారని అంతా విశ్లేషించారు. అయితే జూనియర్ ని 2014 ఎన్నికల నాటికి మాత్రం పిలవలేదు, పైగా పార్టీ కోసం కావాల్సి వస్తే ఎవరికి వారే వచ్చి చేయాలంటూ బాలయ్య, లోకేష్ వంటి వారు గుచ్చే మాటలు అన్నారు.

ఇక జూనియర్ కి ఉన్న చరిష్మాటిక్ ఫిగర్ తో ఏదో నాడు కుమారుడు లోకేష్ కి అడ్డు అవుతారని తెలివిగానే చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టారన్న ప్రచారమూ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ కూడా టీడీపీ అంతర్గత రాజకీయాల పట్ల విసిగిపోయారని టాక్. పైగా ఆయనకు సినిమా రంగంలో ఎంతో ఆదరణ ఉంది. మరింతకాలం ఆయన హీరోగా ఉజ్వలంగా వెలిగే సీన్ ఉంది. ఇక రాజకీయాల్లోకి వచ్చి టీడీపీకి కట్టుబడి ప్రచారం చేసి ఒక సెక్షన్ కి చెడ్డ కావడం వల్ల ఒనకూడేది లేదని కూడా గ్రహించడం వల్లనే అలా తన పనిలో తాను ఉన్నారని చెబుతారు.

లేటెస్ట్ గా చంద్రబాబు కన్నీళ్ళు, భువనేశ్వరి మీద చేశారంటూ వచ్చిన కామెంట్స్ నేపధ్యంలో జూనియర్ ఆచీ తూచీ స్పందించారు. ఆయన ఒక దేశ పౌరుడిగానే తాను ఈ అంశం మీద మాట్లాడుతున్నానని చెప్పారు తప్ప ఎక్కడా చంద్రబాబు కంట కన్నీరు కార్చిన‌ విషయం కానీ ఇతర అంశాలు కానీ ప్రస్థావించలేదు. పైగా అన్ని పార్టీలకు హితవు చెప్పే విధంగా ఆయన తన వీడియో సందేశాన్ని వినిపించారు. ఇది చాలా మంది విజ్ఞులు వివేకవంతులకు, సగటు జనాలకు నచ్చింది కానీ టీడీపీ వర్గాలకు మాత్రం ఎక్కడా మింగుడుపడలేదు. చంద్రబాబుకు మద్దతుగా జూనియర్ గొంతెత్తుతాడు అనుకున్న వారికి ఈ పరిణామాలు షాక్ తినిపించాయి. 2024 ఎన్నికల్లో జూనియర్ సహకారం అవసరం అని అంతా అంటున్నారు.

నిజానికి పార్టీని లేపాలంటే ఆయనే శరణ్యం అని తమ్ముళ్ళు చెబుతున్నారు. అయితే జూనియర్ మాత్రం దూరం పాటిస్తున్నారు. టీడీపీ రాజకీయ రొచ్చులో తాను పడకూడదు అనే ఆయన ఉన్నారని అంటున్నారు. దాంతో టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జూనియర్ కి యాంటీగా నెగిటివ్ ప్రచారం మొదలెట్టేసారు. సొంత మేనత్త మీద విమర్శలు వస్తే ఇలాగనా స్పందించేది అంటూ హాట్ హాట్ గా తమ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా ఏం చేసినా కూడా జూనియర్ మాత్రం తన స్టాండ్ మేరకే బ్యాలన్స్ తప్పకుండా చక్కగా రియాక్ట్ అయ్యాడన్నదే మెజారిటీ వర్గాల భావన. ఏది ఏమైనా జూనియర్ తీరు చూస్తే టీడీపీ కాడె మోసేందుకు తాను రెడీగా లేనన్న సందేశం ఇవ్వకనే ఇచ్చేశాడు అంటున్నారు. చూడాలి మరి 2024 అంటే చాలా టైమ్ ఉంది. ఈ లోగా పరిణామాలు ఎలా మారుతాయో.