Begin typing your search above and press return to search.

అధికార పార్టీలోకి మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   15 April 2016 1:41 PM GMT
అధికార పార్టీలోకి మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు!
X
తెలంగాణ రాష్ట్రంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరు కొన‌సాగుతోంది. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్‌ రెడ్డి గులాబీ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. డీకీ అరుణ సోద‌రుడైన రామ్మోహ‌న్‌ రెడ్డి చేరిక‌పై అరుణ మ‌న‌స్తాపం వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబంలో చిచ్చుపెట్టార‌ని ఫైర్ అయ్యారు. టీఆర్ ఎస్‌ పై దుమ్మెత్తిపోశారు. ఈ కామెంట్ల‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు.

తెలంగాణ భవన్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ...ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు జానారెడ్డి, డీకే అరుణ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి లేదన్నారు. గతంలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మీరెందుకు నోరు మెదపలేదని నిల‌దీశారు. కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌ లోకి వస్తారని తెలిపారు.

తెలంగాణలో ప్రజలు సీమాంధ్ర పార్టీలను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా టీడీపీకి డిపాజిట్ దక్కిందా అని ప్రశ్నించారు. టీడీపీకి డిపాజిట్ లేకుండా ప్రజలే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీని ప్రజలే వద్దనుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని చెప్పారు. యావత్ దేశం అబ్బురపడే విధంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోడీ కూడా అభినందిస్తున్నారని తెలిపారు.